
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పౌర ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పౌర ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు కేంద్రంగా మారిన షహీన్‌బాగ్‌లో ఆందోళనకారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీలు సమకూరుస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి కేజ్రీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కనీసం రక్షిత మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు.
బీఐఎస్ సర్వే ప్రకారం ఢిల్లీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం విషపూరిత నీటిని తాగేలా చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో సీఏఏ నిరసనకారులకు మాత్రం బిర్యానీ సరఫరా చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని కరవాల్ నగర్, ఆదర్శ్ నగర్, నరేలా, రోహిణీల్లో జరిగిన నాలుగు ర్యాలీలను ఉద్దేశించి యోగి ఆదిత్యానాథ్ ప్రసంగించారు. గతంలో రాళ్లు విసిరేవారు పాకిస్తాన్ నుంచి డబ్బు తీసుకుని కశ్మీర్‌లో ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేవారు. కేజ్రీవాల్, కాంగ్రెస్‌లు విధ్వంసకారులకు మద్దతిస్తూ వారికి బిర్యానీలు పంచితే తాము మాత్రం వారికి బుల్లెట్ రుచిచూపామని ధ్వజమెత్తారు.