ప్రధాని మోదీని నిద్రపోనివ్వం | Wont Let PM Modi Sleep Until All Farm Loans Waived | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని నిద్రపోనివ్వం

Dec 19 2018 3:40 AM | Updated on Dec 19 2018 3:40 AM

Wont Let PM Modi Sleep Until All Farm Loans Waived - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరి రుణాలు మాఫీ చేసేంత వరకు ప్రధాని మోదీని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులకు దాసోహమంటున్న మోదీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకున్న అన్నదాతలను మాత్రం పట్టించుకోవడం లేదంటూ మంగళవారం మీడియా సమావేశంతోపాటు ట్విట్టర్‌లో ఆయన విరుచుకుపడ్డారు. ‘గత నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతు రుణాలను ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదు. దేశంలోని అందరు రైతుల రుణాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించే వరకు ప్రధానిని నిద్రపోనివ్వం’ అని అన్నారు. మోదీ ప్రభుత్వం ఆ పని చేయకుంటే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తాము రద్దు చేస్తామని ప్రకటించారు. రైతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

టైపింగ్‌ పొరపాట్లు ఇంకా ఉంటాయి
రఫేల్‌ వివాదంలో సుప్రీంకోర్టుకు అందజేసిన అఫిడవిట్‌లో టైపింగ్‌ పొరపాట్లు దొర్లాయన్న ప్రభుత్వ వివరణపై రాహుల్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, రాఫెల్‌ అంశం, రైతు సమస్యలు, నోట్లరద్దు వంటి విషయాల్లో టైపింగ్‌ పొరపాట్లు ఇక నుంచి మొదలవుతాయి’ అని మోదీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. రఫేల్‌ అంశంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలన్న తమ డిమాండ్‌పై ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని ప్రశ్నించారు.

సమాధానాలు దాటవేసిన రాహుల్‌
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌కు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించడంపై మీడియా ప్రశ్నకు రాహుల్‌ సమాధానం దాటవేశారు. ‘ఇది చాలా చిన్న విషయం. దీనిపై గతంలోనే స్పష్టంగా చెప్పా. దేశంలోని రైతుల రుణాల మాఫీకి ప్రధాని మోదీ నిరాకరించడంపై మాట్లాడటమే ఈ సమావేశం ఉద్దేశం’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement