తన భర్తను చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మహిళ తన బంధువులైన మరో ముగ్గురు మహిళలతో కలసి నిందితుడి ఇంటిని తగులబెట్టింది.
భోపాల్: తన భర్తను చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ మహిళ తన బంధువులైన మరో ముగ్గురు మహిళలతో కలసి నిందితుడి ఇంటిని తగులబెట్టింది. మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ జిల్లా మహేంద్ర గ్రామంలో ఈ ఘటన జరిగింది.
నిందితుడు కైషియా దామోర్ ఇటీవల పనికోసం పొరుగునే ఉన్న గుజరాత్లోని బరోడా జిల్లా ఇండికా గ్రామానికి వెళ్లాడు. అక్కడ దాల్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడ్డాడు. ఇతనిది దాహోద్ జిల్లాలోని ఉఛిసదెడ్ గ్రామం. దామోర్.. దాల్ సింగ్ను హత్య చేసి పారిపోయాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. దామోర్పై ప్రతీకారం తీర్చుకునేందుకు దాల్ సింగ్ భార్య జైలాబాయ్ మరో ముగ్గురు బంధువులతో కలసి శుక్రవారం ఉదయం మహేంద్ర గ్రామానికి వెళ్లింది. నలుగురు కలసి దామోర్ ఇంటిని తగులబెట్టారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఇంట్లోని వస్తువులు, నగలు, ధాన్యం మంటల్లో కాలిపోయాయని అలిరాజ్పూర్ జిల్లా ఎస్పీ కుమార్ సౌరభ్ చెప్పారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దున గల ఈ ప్రాంతంలో గిరిజనులు ప్రతీకార చర్యగా ఇంటిని తగులబెట్టడం ఆనవాయితీగా వస్తోందని, అయితే మహిళలు ఈ పనిచేయడం ఇదే తొలిసారని ఎస్పీ చెప్పారు.