నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ మహిళకు ఉంది

woman has freedom whom to marry says Supreme Court - Sakshi

అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: నచ్చిన వ్యక్తిని వివాహమాడటంతో పాటు ఇష్టమున్న చోట నివసించే స్వేచ్ఛ వయోజన మహిళకు ఉంటుందని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తమ సోదరి దయవంతిని గుజరాత్‌ నుంచి అపహరించారని, ప్రస్తుతం ఆమె హరియాణాలో జగదీశ్‌ అనే వ్యక్తితో బలవంతంగా ఉంటోందని యువతి కుటుంబ సభ్యులు సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏంఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. దయవంతికి సమన్లు జారీచేసింది. దీంతో సోమవారం విచారణకు హాజరైన దయవంతి.. తాను ఇష్టపూర్వకంగానే జగదీశ్‌తో ఉంటున్నట్లు స్పష్టం చేశారు. దయవంతి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఎవరితో, ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ ఓ మహిళకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  

‘సీసీటీవీ’ల ఏర్పాటుపై కేంద్రానిది నిర్లక్ష్యం..
న్యూఢిల్లీ: కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసుల విచారణను వీడియో రూపంలో రికార్డు చేసేందుకు సీసీటీవీల్ని ఏర్పాటుచేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టు విమర్శించింది. ట్రయల్‌ కోర్టులు, ట్రిబ్యునళ్లలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఏర్పాటుచేసిన సీసీటీవీల పనితీరును సమీక్షించిన తర్వాత మిగతా కోర్టుల్లో వీటిని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ‘ఈ విషయంలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ట్రయల్‌ కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీలపై స్థితి నివేదికను మాముందు ఉంచండి’ అని జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణలో సాయపడేందుకు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రాను అమికస్‌ క్యూరీగా నియమించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top