
భుజ్/జస్డన్: టీ అమ్మేందుకు తాను సిద్ధమని, అయితే దేశాన్నే అమ్మే పాపానికి మాత్రం ఎన్నటికీ ఒడిగట్టనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం భుజ్‌లో ప్రారంభిస్తూ... కాంగ్రెస్‌ను, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను విమర్శించారు.
పాకిస్తాన్‌లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ విడుదలైనప్పుడు ఎందుకు సంబరపడ్డారో? డోక్లాం వివాదం కొనసాగుతుండగా చైనా రాయబారిని ఎందుకు హత్తుకున్నారో? రాహుల్ సమాధానం చెప్పాలన్నారు. గుజరాత్‌లోని భుజ్, జస్డన్, చాలాల, కడోదర(సూరత్)ల్లో నిర్వహించిన ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. ఇటీవల పాక్ కోర్టు ఒక ఉగ్రవాదిని విడుదల చేయగా.. రాహుల్ ఎందుకు మెచ్చుకున్నారో తనకు అర్థం కాలేదని భుజ్ సభలో ప్రధాని ప్రశ్నించారు. ‘సయీద్ విడుదలైనప్పుడు మీరు చప్పట్లు కొట్టారు.
భారత సైన్యం సర్జికల్ దాడుల్ని మీరు గౌరవించరు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు. ఉడీ సెక్టార్‌లో వారు మన సైనికుల్ని చంపారు. మన సైనికులు వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ దాడులు చేసి తిరిగొచ్చారు. మృతదేహాల్ని పాకిస్తాన్ ట్రక్కుల్లో తరలించినట్లు తర్వాతి రోజు ఒక వార్తా పత్రిక పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ దాడులపై సందేహం వ్యక్తం చేసింది. వారు మన భారత సైన్యాన్ని గౌరవించలేదు. మన సైనికుల్లో ఎవరూ ఎందుకు గాయపడలేదు? దాడి సమయంలో ఫొటో, వీడియో ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మనవాళ్లు పాకిస్తాన్‌కు సినిమా చిత్రీకరణ కోసం వెళ్లారా?’ అని కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
పేదరికాన్ని ఎగతాళి చేస్తున్నారు..
భారత సైనికులు 70 రోజులకు పైగా డోక్లాంలో చైనాతో ముఖాముఖి తలపడినప్పుడు.. చైనా రాయబారిని ఆలింగనం చేసుకున్నారని, ఎవరి ప్రయోజనం కోసం ఇలా చేశారని రాహుల్‌ను ప్రశ్నించారు. తనపై గుజరాత్ ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని ప్రధాని తిప్పికొట్టారు. ‘ఈ గుజరాతీ పుత్రుడి ప్రజా జీవితంలో ఎలాంటి మరకలు లేవు. మీరు గుజరాత్‌కు వచ్చి ఆధారాలు లేకుండా ఈ భూమి పుత్రుడిపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు.
చాయ్‌వాలా అనడాన్ని తప్పుపడుతూ.. తన నిరాడంబర గత జీవితం, పేద తల్లికి జన్మించడం వల్లే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ‘చాయ్‌వాలా ప్రధాని అయినందుకు వారు అసంతృప్తిగా ఉన్నారు. ఉన్నత వర్గాలు అణగారిన ప్రజల్ని ఎలా వేధించేవారో మనం పుస్తకాల్లో చదివేవాళ్లం. అయితే వారు ఇంత స్థాయికి దిగజారుతారని నేనూహించలేదు’ అని జస్డన్ ర్యాలీలో మోదీ అన్నారు. ‘మీరెందుకు పేదరికాన్ని ఎగతాళి చేస్తున్నారు? పేద తల్లిని అవమానిస్తున్నారు’ అని మోదీ ప్రశ్నించారు.
సీఎంలను వేధించారు
పటీదార్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్‌పై కక్షతో పటేల్ వర్గానికి చెందిన మాజీ సీఎంలు బాబుభాయ్ పటేల్, చిమన్‌భాయ్ పటేల్, కేశుభాయ్ పటేల్, ఆనందీ బెన్ పటేల్‌లను వేధించిందని ఆరోపించారు. ఆనందీబెన్ పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రతిపక్షం అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికలు అభివృద్ధిపై నమ్మకానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య పోటీ అని ప్రధాని అభివర్ణించారు.
‘గుజరాత్ నా ఆత్మ, భారతదేశం నా పరమాత్మ అని నేనొక కవిత రాశాను. నేను ఈ నేలపై పెరిగాను, నా బలం, బలహీనతలు గుజరాతీలకు తెలుసు. నాలోని మంచికి ఈ మట్టే కారణం’ అని పేర్కొన్నారు. సర్దార్ పటేల్‌ను గుర్తు చేసుకుంటూ.. ‘ఆయనపై కాంగ్రెస్ దురాగతాలకు పాల్పడినప్పుడు ఆ అవమానాల్ని గుజరాతీలు సహించారు. ఇప్పుడు గుజరాతీలు అందుకు సిద్ధంగా లేరు. పరిస్థితి మారింది’ అని ప్రధాని చెప్పారు.