ఈ 108 మంది చావుకు ఎవరు బాధ్యులు !?

Whose To be Blame, As hooch kills 108 men - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘అవును! ఇంతటి విషాధానికి ఆదిత్యనాథ్‌ యోగియే బాధ్యత వహించాలి. ఇది గత ప్రభుత్వం హయాంలో జరిగి ఉంటే అది సమాజ్‌వాది పార్టీ బాధ్యతగా మేము కచ్చితంగా భావించేవాళ్లం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? వారి ప్రభుత్వం ఆధ్వర్యంలోనేగదా, పోలీసు వ్యవస్థ ఉన్నది. పైగా ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చాక పోలీసులకు స్వేచ్ఛ పెరిగింది. పోలీసుల అండదండలతోనే గదా! ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కల్తీ మద్యం ఏరులై పారుతోంది’ అని కల్తీ మద్యం కారణంగా ధరమ్‌ పాల్‌ అనే 51 ఏళ్ల సోదరుడిని, సోను అనే 30 ఏళ్ల మేనల్లుడిని కోల్పోయిన శివపూర్‌ రైతు సుధీర్‌ కుమార్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. చెవిటి, మూగ అయిన సోను దినసరి కూలి అని, మతిస్థిమితం లేని ఆయన తల్లిదండ్రులు ఆయనపైనే ఆధారపడి బతుకుతున్నారని స్థానికులు తెలిపారు. 

‘అక్రమ మద్యం వ్యాపారులను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి విషాధ సంఘటనలకు తెరపడదు. పలానా, పలానా ముఠాలు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాయని నేను స్వయంగా మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ విషయం కల్తీ వ్యాపారులకు తెలిసి పోయింది. వారు పలుసార్లు నాకు ఫోన్‌ చేసి చంపేస్తామంటూ బెదిరించారు. అప్పటి నుంచి నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా మానేశాను’ అని సహ్రాన్‌పూర్‌లో మద్యం ‘డీఅడిక్షన్‌’ కేంద్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మమత ఆరోపించారు. 

మంగళవారం ఉదయం ధన్‌పాల్‌ సింగ్‌ మరణంతో కల్తీ మద్యం దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 108కి చేరుకుంది. 48 ఏళ్ల ధన్‌పాల్‌ సింగ్‌ దినసరి కూలి. ఆయన శవానికి సహరాన్‌పూర్‌లోని సేత్‌ బల్దేవ్‌ దాస్‌ బజోరియా జిల్లా ఆస్పత్రిలో అటాప్సీ నిర్వహించిన తర్వాత ఆస్పత్రి వర్గాల నుంచి ఆయన శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా ఆయన బంధువులు పోలీసులను ప్రాధేయపడ్డారు. ‘మీ ఒక్క శవమే కాదు, బోలెడు శవాలు ఉన్నాయి. అప్పగించడానికి ముందు బోలెడంతా తతంగం ఉంటుంది’ అని పోలీసు అధికారులు బంధువులపై విసుక్కున్నారు. ధన్‌పాల్‌ శవాన్ని పోలీసు వ్యాన్‌ ఎక్కించారు. ‘నా అన్న చావుకు పోలీసులు, అధికార యంత్రాంగం కారణం కాకపోతే, ఎవరు కారణం?’ అంటూ ధన్‌పాల్‌ సింగ్‌ తమ్ముడు రాకేశ్‌ సింగ్‌ అడిగిన ప్రశ్న ఒక్క మీడియా తప్పించి ఎవరు వినిపించుకోలేదు. ఉత్తరాఖండ్‌ సరిహద్దు సమీపంలోని బలుపూర్‌ గ్రామంలో ఈ ఫిబ్రవరి ఏడవ తేదీన ఓ ఇంటిలో జరిగిన 13వ రోజు కర్మ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు కల్తీ మద్యం సేవించారు. కల్లు తిరగడం, కడుపునొప్పి, వాంతులతో వారంతా బాధపడ్డారు. 

వారిలో సకాలంలో ఆస్పత్రిలో చేరి బతికిన వాళ్లు తక్కువ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవానాన్ని అడ్డుకోలేక పోయింది. ఢిల్లీ, గుజరాత్‌ తరహాలో కల్తీ మద్యం వ్యాపారులకు మరణ శిక్ష విధించేలా ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం 2017, డిసెంబర్‌లో ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అయినా ఫలితం లేదు. 2018, జనవరి బారబంకిలో కల్తీ మద్యానికి 11 మంది మరణించారు. గత మే నెలలో కాన్పూర్‌లో కల్తీ మద్యానికి పది మంది మరణించిన నేపథ్యంలో వినయ్‌ సింగ్‌ అనే వ్యక్తి గిడ్డంగి మీద పోలీసులు దాడిచేయగా, కల్తీ మద్యం సరకులు దొరికాయి. ఆయన సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ మంత్రి రామ్‌ స్వరూప్‌ సింగ్‌ గౌర్‌కు మనవడని తేలింది. వినయ్‌ సింగ్‌ సోదరుడు నీరజ్‌ 2017లో అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా కల్తీ మద్యం సరఫరా చేసే ముఠాలు మారుతాయి తప్ప మద్యం అక్రమ వ్యాపారం ఆగిన దాఖలాలు లేవని ప్రజలు చెబుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top