ఇది అమానవీయం కాదంటారా?

Whom Should Be Blame for 39 Indians Killed in Iraq - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లో అదృశ్యమైన 39 మంది ఎలా ఉన్నారన్న సమాచారం కోసం గత నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మంగళవారం నాడు వారు భరించలేని విషాద వార్తలను భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇరాక్‌ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఇరాక్‌లో 40 మంది భారతీయ కార్మికులను ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టులు కిడ్నాప్‌ చేశారన్న వార్త వెలుగులోకి వచ్చింది.

అంటే, ఇది మోదీ ప్రభుత్వానికి మొట్టమొదటి సవాల్‌. ఈ సవాల్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నా టెర్రరిస్టుల చేతుల నుంచి భారతీయులను విడిపించడం అంత సులువు కాకపోవచ్చు. కానీ నాలుగేళ్లుగా వారు క్షేమంగా ఉన్నారని, వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పదే పదే చెబుతూ సుష్మా స్మరాజ్‌ భారతీయులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను  ఎందుకు మభ్య పెడుతూ వచ్చారన్నదే జవాబు దొరకని ప్రశ్న. సుష్మా స్మరాజ్‌ ఈ నాలుగేళ్లలో ఆరుసార్లు నిర్బంధితుల క్షేమ సమాచారంపై ప్రకటనలు విడుదల చేశారు. ప్రతి ప్రకటనలో వారు ‘ప్రాణాలతో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు’ను నొక్కి చెప్పారు.

వారిని కాల్చివేయడాన్ని తాను కళ్లారా చూశానంటూ టెర్రరిస్టుల చెర నుంచి తప్పించుకొని వచ్చిన హార్జీత్‌ మాసిహ్‌ వెల్లడించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడంలో అర్థం ఏముంది? తప్పించుకొచ్చిన వైనంపై హార్జీత్‌ చెప్పిన మాటలు నమ్మశక్యంగా అనిపించలేదని, అందుకనే ఆయన మాటలను నమ్మలేదని సుష్మా ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. అసలు ఆమె మాటలే నమ్మశక్యంగా లేవు. వారు క్షేమంగా ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లేకుండా ఆమె ఎందకు ప్రకటనలు చేసినట్లు? ఎందుకు మభ్యపెట్టినట్లు?

పైగా ఇరాక్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టుల నిర్బంధంలో ఉన్నవారిని విడిపించి తీసుకరావడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను పంపిస్తున్నట్లు కథలు ప్రచారం అయ్యాయి. ఒక వర్గం మీడియా అయితే నాడు అజిత్‌ దోవల్‌ను భారతీయ జేమ్స్‌ బాండ్‌గా అభివర్ణించింది. చివరకు నిర్బంధితులు క్షేమంగా లేరని, వారిని ఎప్పుడో చంపేశారనే విషయం తెల్సిన తర్వాత కూడా ఈ విషయాన్ని సుశ్మా స్వరాజ్‌ వారి కుటుంబ సభ్యులకు ముందుగా తెలియజేయకుండా, పార్లమెంట్‌కు ముందుగా తెలియజేయడం అమానవీయమే!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top