
ఆర్థిక సర్వే ఏంచెబుతోందంటే...
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ‘ఉపాధి హామీ’ని వెంటనే ప్రక్షాళన చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘
‘ఉపాధి’ని ప్రక్షాళన చేయాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ‘ఉపాధి హామీ’ని వెంటనే ప్రక్షాళన చేయాల్సి ఉందని కేంద్ర ఆర్థిక సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘ఉపాధి హామీ’ పథకాన్ని దేశ అభివృద్ధికి తోడ్పడేలా చేయాలని సూచించింది. ఈ పథకం పలుచోట్ల దుర్వినియోగం అవుతోందని, దానిని అరికట్టాల్సి ఉందని పేర్కొంది. ఉపాధి పథకాన్ని గ్రామ పంచాయతీలు కేంద్రంగా నిర్వహించడం వల్ల.. పథకం కింద నిర్వహించే పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ సరిగా ఉండట్లేదని వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పథకంపై చైతన్యం లేకపోవడం, పనుల ఎంపికలో దురుద్దేశం, సామాజిక తనిఖీలు సరిగా నిర్వహించకపోవడం వంటి వాటివల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయంది. ‘ఉపాధి’ కింద ఇస్తున్న వేతనం తక్కువగా ఉండడం వల్ల మహిళలు మాత్రమే పనిచేస్తున్నారని... దీంతో చిన్నస్థాయి పనులు మాత్రమే జరుగుతున్నాయంది. తక్కువ మందికి లబ్ధి కలిగే పనులను కాకుండా... చాలామందికి ఉపయోగపడే పనులను ‘ఉపాధి’ కింద చేపట్టాలని అభిప్రాయపడింది. ఈ పథకం కింద శాశ్వత ఆస్తుల కల్పన, పర్యాటకాభివృద్ధికి తోడ్పడే పనులు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే పనులను చేపట్టాలని సూచించింది. దీంతోపాటు గ్రామీణ జీవనోపాధి కల్పన పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, సర్వశిక్షా అభియాన్ తదితర పథకాలనూ పునర్వ్యవస్థీకరించడమో, ప్రక్షాళన చేయడమో తప్పనిసరని స్పష్టం చేసింది.
యూరియాపై రూ.8,500 కోట్లు వృథా
న్యూఢిల్లీ: యూరియాపై భారత ప్రభుత్వం, రైతులు మొత్తం రూ.8,500 కోట్లు వృథా చేస్తున్నారని ఆర్థిక సర్వే 2013-14 వెల్లడించింది. అస్తవ్యస్త విధానాలవల్ల ఎరువుల రంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయని, దీనివల్ల అధికమొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. ఎరువులకు భారీ సబ్సిడీ ఇవ్వడంవల్ల అవసరంలేకున్నా ఉపయోగిస్తున్నారని, ఆహారపదార్థాల ధరలు, పన్నులు పెరగడానికి ఇది కారణమవుతుందని సర్వేలో తెలిపింది. యూరియాను తక్షణమే పోషకపదార్థాల ఆధారిత సబ్సిడీ పద్ధతిలోకి తీసుకువచ్చి రైతులకు నేరుగా సబ్సిడీని చెల్లించాలని పేర్కొంది. దేశంలో అవసరానికి మించి దాదాపు 50 లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేస్తున్నారని, రైతులు రూ.2,680కోట్లు, ప్రభుత్వం రూ.5,860కోట్లు వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. అధిక ధరలు, అధిక పన్నుల రూపంలో అంతిమంగా ఈ భారం విని యోగదారుడిపైనే పడుతోందని పేర్కొంది. ఒక టన్ను యూరియాకు రైతు రూ.5,360 చెల్లిస్తుండగా, సర్కారు రూ.11,760 సబ్సిడీగా చెల్లిస్తోందని తెలిపింది.
‘మధ్యాహ్న భోజనం’ను సంస్కరించాలి
న్యూఢిల్లీ: విద్యార్థులను పాఠశాలవైపు మళ్లించాలంటే.. ప్రస్తుతం అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సంస్కరించాలని ‘ఆర్థిక సర్వే ’ పేర్కొంది. అలాగే ప్రాథమిక, మాధ్యమిక విద్యావ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టంచేసింది. సర్వే వివరాల ప్రకారం... ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే బాధ్యతల వల్ల టీచర్ల బోధనపై ప్రభావం పడుతోంది. ఈ పథకం కింద 2013-14లో రూ.10,927 కోట్ల వ్యయంతో సుమారు 10.80 కోట్ల మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. 2012-13 నాటికి దేశంలో 723 యూనివర్సిటీలు, 37,204 కాలేజీలు, 11,356 డిప్లొమా స్థాయి విద్యాసంస్థలున్నాయి. 2013-14లో దేశ జీడీపీలో 3.3 శాతాన్ని విద్యారంగంపై ఖర్చు చేశారు. విద్యారంగంపై వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. 2013-14 వరకూ సర్వశిక్షా అభియాన్ కింద.. 3,57,611 కొత్త ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద 15.06 లక్షల మంది టీచర్లను నియమించారు.