ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
నేటి భేటీ తర్వాత తదుపరి నిర్ణయం: కర్ణాటక సీఎం
సాక్షి, బెంగళూరు: ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరి నీటిని వదిలేది లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన గురువారం జరిగే ఉన్నతస్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పన ఈ నెల 30 వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటకను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉదయం 9.30 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలపై చర్చించడానికి తర్వాత మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. రెండు సమావేశాల్లోనూ మెజారిటీ సభ్యులు తమిళనాడుకు నీటిని వదలకూడదని తేల్చిచెప్పారు.