'వాటిని వైద్య కమిషన్‌ నియంత్రణ కిందకు తీసుకురావాలి'

Vijayasaireddy Comments About Homeo And Naturopati In Rajyasabha - Sakshi

ఢిల్లీ : ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన యోగా, నేచురోపతి వంటి వైద్య విధానాలను సైతం భారతీయ వైద్య విధాన కమిషన్‌ నియంత్రణ కిందకు తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్‌ బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్‌ బిల్లులపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేద, యునాని, సిద్ధ, సోవా రిగ్పాను నియంత్రిస్తూ ఆయా రంగాలలో పారదర్శకత, బాధ్యతను కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన సంస్కరణల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

భారతీయ వైద్య విధానాలలో విద్య, వృత్తి నియంత్రణ కోసం యోగా, నేచురోపతిని కూడా తప్పనిసరిగా వైద్య కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే బిల్లులోని సెక్షన్‌33లో పొందుపరచిన ఒక నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ నిబంధన కారణంగా భారతీయ వైద్య విధానాలు ప్రాక్టీస్‌ చేసే అర్హులైన వైద్యులకు అన్యాయం జరుగుతుంది.ఈ నిబంధన కారణంగా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ ఉత్తీర్ణులు కాని కొందరు కమిషన్‌ అనుమతితో ప్రాక్టీసు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఫలితంగా నకిలీ వైద్యుల బెడదను అరికట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు లక్ష్యం నిర్వీర్యమవుతుందని తెలిపారు.

ఓబీసీల సబ్‌కేటగిరీపై కమిషన్‌ గడువు పెంపు :
ఓబీసీల సబ్‌కేటగిరీపై కమిషన్‌ గడువు పెంపుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్‌ గుర్జర్‌ రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాలను సబ్‌ కేటగిరిగా విభజించాలన్న ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్‌ గడువును ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. రిజర్వేషన్‌ ఫలాలు ఓబీసీలకు సమాన నిష్పత్తిలో అందడం లేదన్న ఫిర్యాదులపై ఎలాంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించలేదని మంత్రి తెలిపారు. అయితే ఓబీసీలను సబ్‌ కేటగిరీల కింద విభజించాలంటూ వచ్చిన డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌340 కింద కల్పించిన అధికారాన్ని వినియోగించి 2017 అక్టోబర్‌2న కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియంమించిదన్నారు. ఈ కమిషన్‌ గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ రావడం జరిగింది. తాజాగా కమిషన్‌ గడువును ఈ ఏడాది జూలై 31కి పొడిగిస్తూ గత జనవరి 17న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు మంత్రి వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top