మమ్మల్ని తిరుపతి వేంకటకవులనేవారు

Venkaiah Naidu Tribute To Jaipal Reddys Condolence Meet - Sakshi

జైపాల్‌రెడ్డి సంస్మరణ సభలోఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో తనను, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డిని అందరూ తిరుపతి వేంకట కవులుగా పిలిచేవారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని అంబేడ్కర్‌ అంతర్జాతీయకేంద్రంలో జైపాల్‌రెడ్డి సంస్మరణసభ ఏర్పాటు చేశారు. సభ లో వెంకయ్యతోపాటు ఆయన సతీమణి ఉశమ్మ, మాజీప్రధాని మన్మోహన్‌ సింగ్, ఢిల్లీ ముఖ్యమం త్రి అరవింద్‌ కేజ్రీవాల్, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి, కాంగ్రెస్‌ సీనియర్లు దిగ్విజయ్‌ సింగ్, అభిషేక్‌ సింఘ్వీ, జైరాం రమేశ్, కొప్పుల రాజు, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎల్‌జేడీ నేత శరద్‌ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 

జైపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మమ్మ, కుమారులు అరవింద్, ఆనంద్, కుమార్తె అరుణ, ఇతర కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ తాను నమ్మిన ప్రజాస్వా మ్య విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడిన నాయ కుడు జైపాల్‌ రెడ్డి అని కొనియాడారు. తామిద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలకు ముందు ఇంట్లో కలుసుకొని ఆరోజు సభ అజెండాపై చర్చింకుకొనే వారిమని అన్నారు. సభ లో ఎల్లప్పుడూ పక్కనే కూర్చొనేవాళ్లమని, అన్ని విషయాలపట్ల జైపాల్‌రెడ్డికి సునిశిత పరిశీలన, జాతీయ, అంతర్జాతీయ అంశాలపట్ల పరిజ్ఞానం ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. 

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ జైపాల్‌ రెడ్డి మరణంతో దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా జైపాల్‌ పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. జైపాల్‌ రెడ్డి తనకు మార్గదర్శి అని, అనేక ఆంశాలను ఆయన్నుంచి నేర్చుకొనేవాడినని ఏచూరి చెప్పారు. జైపాల్‌ రెడ్డి మరణంతో వ్యక్తిగత స్నేహితుడ్ని కోల్పోయినట్లు మురళీ మనోహన్‌ జోషి, డి.రాజా విచారం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్‌ సీనియర్లు, ఇతర పార్టీల నేతలు ప్రసంగించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top