దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది

venkaiah naidu releases president ramnath kovind speeches - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉందని, కానీ దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఆ ప్రతి దాడి.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన రెండో సంవత్సర పాలనలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన ‘రిపబ్లికన్‌ ఎథిక్‌–2’, ‘లోక్‌తంత్ర కే స్వర్‌’ ఖండ్‌–2 పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా వెంకయ్యనాయుడు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. దేశ చరిత్రను పరిశీలిస్తే ఎక్కడా దూకుడు ప్రదర్శించినట్లు కనిపించదని, ‘విశ్వగురువు’గా ప్రసిద్ధి చెందిన భారత్‌ ఎవరిపైనా దాడి చేయలేదని ఆయన గుర్తు చేశారు.  

అయినా దాడి చేయలేదు
చాలా మంది భారత్‌పై దండెత్తినా, పాలించినా, నాశనం చేసినా, మోసం చేసినా తామెవరిపైనా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పుస్తకం లోని ఓ మాటను ప్రస్తావిస్తూ... భారత్‌ తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి శాంతిమార్గా న్నే ఎన్నుకుందన్నారు. రాష్ట్రపతి రాసిన పుస్తకంలో ఆయన జ్ఞానం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పుస్తకాలు కిండిల్‌ వంటి ఆన్‌లైన్‌ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాల్లో జాతినుద్దేశించినవి, ప్రపంచాన్ని ఉద్దేశించినవి, మహాత్మాగాంధీ గురించి మాట్లాడినవి ఉన్నాయని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top