వరద తగ్గింది.. బురద మిగిలింది
వారణాసి తదితర ప్రాంతాల్లో గంగానది వరద తగ్గినా.. బురద పేరుకుపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు
గతంలో 2009 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో తుంగభద్రానది వరదలు వచ్చినప్పుడు ఆ వరద తీవ్రత తగ్గేసరికి మొత్తం జిల్లా అంతా విపరీతంగా బురద పేరుకుపోయింది. ఇళ్లు, పొలాలు.. ఎక్కడ చూసినా బురదే. ఇప్పుడు వారణాసిలో సరిగ్గా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గంగానది ఉధృత రూపం దాల్చడంతో ఇళ్లలోకి చేరిన వరద నీరు ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అయితే, నీళ్లు వెళ్లిపోయిన ప్రాంతాలన్నింటిలోనూ ఇప్పుడు భారీగా బురద పేరుకుపోవడంతో జనజీవనం ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారింది. బురద తొలగించుకునే మార్గాలు తెలియకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్లలో పేరుకున్న ఈ బురదను తీస్తే తప్ప కనీసం వంట చేసుకునే అవకాశం కూడా లేదని వాపోతున్నారు.
వారణాసితో పాటు గంగానది తీరంలోని పలు ప్రాంతాల్లో మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీధుల్లో కూడా విపరీతంగా బురద పేరుకుపోయి ఉండటంతో అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టంగా ఉంది. దీనికి తోడు ఇది ఇలాగే ఉంటే.. వ్యాధులు సైతం విజృంభించే ప్రమాదం ఉంది. ఇళ్లలోకి మురుగు కూడా ప్రవేశిస్తోందని, అసలు ఉండే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. వీలైనంత వరకు కర్రలు, మాప్‌లతో ఇళ్లలోని మురుగు, బురదను బయటకు తీసేయడానికి ప్రయత్నిస్తున్నా.. అది అంతంతమాత్రం ఫలితాలనే ఇస్తోంది.
ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి, ఫైరింజన్లను రప్పించి వాటితో నీళ్లు కొట్టిస్తేనే ఈ బురద పోయే అవకాశం ఉంటుంది. అప్పటివరకు వారణాసి సహా ఇతర ప్రాంతాల వాసులకు ఈ కష్టాలు, కన్నీళ్లు తప్పవు.







