జైట్లీకి కన్నీటి వీడ్కోలు

UNOIN FORMER MINISTER ARUN JAITLE Funeral PROGRAMME - Sakshi

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

అంతిమయాత్రలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సహా వేలాదిగా అభిమానులు

న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్‌బోధ్‌ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని కైలాస్‌ కాలనీలోని స్వగృహం నుంచి దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చారు.

ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు అక్కడే అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్ష్‌వర్థన్, ప్రకాశ్‌ జవడేకర్, పీయూష్‌ గోయెల్, మణిపూర్‌ గవర్నర్‌ నజ్మా హెప్తుల్లా, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, యోగా గురువు బాబా రాందేవ్‌ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అరుణ్‌ జైట్లీతో సన్నిహిత సంబంధాలున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలపాటు పార్థివ దేహం వద్ద మౌనంగా నిలుచుండి పోయారు.

మధ్యాహ్నం ప్రత్యేక శకటంలో జైట్లీ పార్థివ దేహాన్ని నిగమ్‌బోధ్‌ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్రలో ఉప రాష్ట్రపతి వెంకయ్య, లోక్‌సభ స్పీకర్‌ బిర్లా, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్‌ సిబల్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుసహా అశేష సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు పఠిస్తుండగా జైట్లీ కుమారుడు రోహన్‌ చితికి నిప్పంటించారు. సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ..జైట్లీకి ఉద్వేగపూరిత నివాళులర్పించిన విషయం తెలిసిందే.  

బ్రాండెడ్‌ వస్తువులపై మక్కువ
కుర్తా పైజామాతో అందరికీ ఆత్మీయుడిగా కనిపించే అరుణ్‌ జైట్లీకి లండన్‌లో తయారయ్యే షర్టులు, జాన్‌ కాబ్‌ షూస్‌ వంటి బ్రాండెడ్‌ వస్తువులంటే విపరీతమైన మక్కువనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయ వేత్తగా, ప్రముఖ లాయర్‌గా అందరికీ సుపరిచితుడైన జైట్లీకి బ్రాండెడ్‌ వాచీలు, పెన్నులు, శాలువాలు, షర్టులు, ఇంకా షూలు సేకరించడం హాబీ. ఆయన వాడే వాటిల్లో ప్రఖ్యాత పటేక్‌ ఫిలిప్స్‌(వాచీలు), మాంట్‌ బ్లాంక్‌ (పెన్నులు) ఉన్నాయి.

జైట్లీ అభిరుచులపై కుంకుమ్‌ చద్దా రాసిన ‘ది మారిగోల్డ్‌ స్టోరీ’ పుస్తకంలోని అరుణ్‌జైట్లీ: ది పైడ్‌ పైపర్‌ అనే చాప్టర్‌లో వివరంగా ఉంది. ‘చాలా మంది భారతీయులకు ఒమెగా వాచీలకు మించి తెలియని రోజుల్లోనే జైట్లీ చాలా ఖరీదైన పటేక్‌ ఫిలిప్స్‌ వాచీలను కొనేవారు. మాంట్‌ బ్లాంక్‌ పెన్నులు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి మోడల్‌నూ కొనేవారు. ఇంకా జమవార్‌ షాల్స్‌ను సేకరించేవారు. ఆయన తన కుమారుడికి కొని పెట్టిన మొదటి షూ జత ఇటాలియన్‌ బ్రాండ్‌ సల్వటోర్‌ ఫెర్రాగమో’ అని చద్దా పేర్కొన్నారు.

అలాగే, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ తనకంటూ కొన్ని నియమాలను విధించుకున్నారు. లాయర్‌గా తను తీసుకునే ఫీజు కాకుండా క్లర్కులకు ‘మున్షియానా’(ఫీజు)కూడా అందేలా చూసేవారు. ఈ విధానం ఆయన తోటి వారికి నచ్చకపోయినా అరుణ్‌ తన విధానానికే కట్టుబడి ఉన్నారు’ అని జైట్లీ సతీమణి సంగీత తెలిపారని చద్దా తన పుస్తకంలో పేర్కొన్నారు. అధికారిక పర్యటనల్లోనూ వెంట ఉండే వారి ఖర్చులు    తనే భరించేవారని ఆమె తెలిపారన్నారు.       ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనల సందర్భంగా రాకపోకల కోసం విదేశీ కంపెనీల ప్రతినిధులు కార్లు, ఇతర వాహనాలను సమకూరుస్తామన్నా అంగీకరించేవారు కాదని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top