రక్షణ రంగానికి భారీ కేటాయింపులు!

Union Budget 2020 Allocation Of Money For Defence Sector - Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండోసారి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పరిపాలనలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌పై ప్రసంగించిన నిర్మలా సీతారామన్‌.. రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గత ఏడాది కంటే రక్షణ రంగానికి 5.8 శాతం మాత్రమే ఎక్కువ కేటాయింపులు జరపడం గమనార్హం. పోయిన సంవత్సరం రక్షణ రంగానికి కేంద్రం రూ.3.18 లక్షల కోట్లు కేటాయించింది.

కాగా బడ్జెట్‌లో గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశామని నిర్మల తెలిపిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచినట్లు ఆమె వెల్లడించారు. జీఎస్టీ అమలుతో ఆర్థిక రంగంలో చారిత్రక సం‍స్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమానికి రూ.85 వేల కోట్లు, షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమానికి రూ.53 వేల 700 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. సీనియర్‌ సిటిజెన్స్‌, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. న్యూ ఇండియా, సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని నిర్మల తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top