
న్యూఢిల్లీ: నిరుద్యోగమొక్కటే తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని దేశంలోని నగరాల యువతలో సగం మంది అభిప్రాయపడుతున్నారు. దేశం సరైన దారిలోనే వెళ్తోందని నగర యువతలో 69 శాతం మంది తెలిపినట్లు ఇప్సోస్ అనే సంస్థ తెలిపింది. ‘వాట్ వర్రీస్ ద వరల్డ్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమతౌల్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇప్సోస్ తెలిపింది. ‘పట్టణాల్లో ఉన్న వారిని అక్టోబరులో ప్రశ్నించినప్పుడు సుమారు 46 శాతం మంది నిరుద్యోగం లేదా ఉపాధి లేకపోవడమన్నది అతిపెద్ద సమస్యగా చెప్పుకొచ్చారు. నవంబరులో ఈ సంఖ్య మరో మూడు శాతం పెరిగింది’అని సర్వే తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో పౌరులు అతిపెద్ద సమస్యలుగా పేదరికం, సామాజిక అసమతౌల్యతగా గుర్తించారని, తరువాతి స్థానాల్లో నిరుద్యో గం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి, ఆరోగ్యం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది.