నిరుద్యోగం, ఉగ్రవాదమే అసలు సవాళ్లు

Unemployment, Inflation, Terrorism and Brain Drain Biggest Concerns - Sakshi

పాక్‌ నుంచి భారత్‌కు ముప్పే

అవినీతి, నేరాలూ సమస్యలే

ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ సర్వేలో మెజారిటీ భారతీయుల మనోగతం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట దేశ ప్రజలు నిరుద్యోగం, ఉగ్రవాదంపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశం ముందుకు సాగుతున్న తీరుపై చాలా మంది ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తేలింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఈ అధ్యయనం చేపట్టింది. ఉగ్రవాదం, పాక్‌ నుంచి ముప్పుపై ఎక్కువ శాతం మంది భయాందోళనలు వ్యక్తం చేశారు. 20 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందని సుమారు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత కఠిన సవాలు నిరుద్యోగమే అని 76 శాతం మంది పేర్కొన్నారు.

సర్వే ముఖ్యాంశాలు
► పాక్‌తో భారత్‌కు ముప్పు ఉందని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితి తీవ్రమైన సమస్య అని పేర్కొన్న వారు 55 శాతం మంది.

► కశ్మీర్‌లో పరిస్థితి దిగజారిందని అభిప్రాయపడిన 53 శాతం మంది.

► కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నా ధరలు పెరగడం సమస్యగా మారిందని 73 శాతం మంది చెప్పారు.

► అవినీతి అధికారులు(66 శాతం), ఉగ్రవాదం (63 శాతం), నేరాలు(64 శాతం) దేశానికి పెద్ద సమస్యలుగా మారాయని పేర్కొన్నారు.

► భారత్‌లో అభద్రతా భావంతో జీవిస్తున్నామని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

► 2014 నుంచి మత విద్వేష ఘటనలు పెరిగినా, కేవలం 34 శాతం మందే ఇది పెద్ద సమస్య అని పేర్కొన్నారు.

► ఎన్డీయే హయాంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని 21 శాతం మంది పేర్కొనగా, పరిస్థితి దిగజారిందని 67 శాతం మంది చెప్పారు.

► ధరలు భారీగా పెరిగాయని 65 శాతం మంది, అవినీతి పెచ్చరిల్లుతోందని 65 శాతం మంది, ఉగ్రవాద ఘటనలు పెరిగాయని 59 శాతం మంది అన్నారు.

► ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవినీతిపరులని 69 శాతం పేర్కొనగా, ఎవరు గెలిచినా ఈ పరిస్థితిలో మార్పు రాదని 58 శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగాలు, ఆరోగ్యానికే ప్రాధాన్యం
తర్వాతి స్థానాల్లో తాగునీరు, రోడ్లు
ప్రాధాన్యతాంశాలపై ఏడీఆర్‌ సర్వే
న్యూఢిల్లీ: మెరుగైన ఉద్యోగావకాశాలు, ఆరోగ్య సంరక్షణ,  సురక్షిత తాగునీరుకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సర్వేలో తేలింది. ఓటరు ప్రాధాన్యతా అంశాల్లో ప్రభుత్వ పనితీరు సగటు కన్నా దిగువనే ఉందని తెలిసింది. ఓటరు ప్రవర్తనను ప్రభావితం చేసే కారకాలు, ఓటరు ప్రాధాన్యతా అంశాలు(10), ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన రేటింగ్‌ ప్రాతిపదికగా ఈ సర్వే నిర్వహించారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉండాలని 46.80 శాతం మంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని 34.60 శాతం మంది, సురక్షిత తాగునీరు కావాలని 28.34 శాతం మంది అభిప్రాయపడ్డారు. తరువాతి స్థానాల్లో మెరుగైన రోడ్లు(28.34 శాతం), లోపరహిత ప్రజా రవాణా వ్యవస్థ(27.35 శాతం) ఉన్నాయి. ఓటర్ల టాప్‌ 10 ప్రాధాన్యతా అంశాల్లో వ్యవసాయ సంబంధ విషయాలు కూడా ఉన్నాయి. సాగునీరు(26.40 శాతం) ఆరో స్థానంలో, రుణ పరపతి(25.62 శాతం) ఏడో స్థానంలో, పంట ఉత్పత్తులకు మద్దతు ధర(25.41 శాతం) 8వ స్థానంలో, సబ్సిడీలు(25.06 శాతం) 9వ స్థానంలో ఉన్నాయి. మెరుగైన శాంతి భద్రతలకు 10వ స్థానం దక్కింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top