సేఫ్‌లో టోక్యో టాప్‌

Tokyo ranks as the world's safest city for the third time - Sakshi

ముంబైకి 45వ ర్యాంకు

ఢిల్లీకి 52వ ర్యాంక్‌

సురక్షిత నగరాల జాబితాను విడుదల చేసిన ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు–2019 జాబితాలో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్‌–10లో ఆరు ర్యాంకులను ఈ ప్రాంతంలోని నగరాలే చేజిక్కించుకున్నాయి. జపాన్‌ రాజధాని టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే ఈసారి అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. తొలిసారి టాప్‌–10లోకి దూసుకొచ్చింది. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. ముంబై 45వ స్థానంలో.. ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి.

ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితా–2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్‌–60 సిటీలతో ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్‌ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. దీని ప్రకారం.. నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోతున్న హంకాంగ్‌ 2017లోని తన 9వ ర్యాంకుని కోల్పోయి.. 20వ స్థానానికి పడిపోయింది. ఇక ఆసియా–పసిఫిక్‌ ప్రాంతం డిజిటల్‌ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని చెప్పారు. ఆసియా నుంచి ఢాకా(బంగ్లాదేశ్‌), కరాచీ(పాకిస్తాన్‌), యంగూన్‌(మయన్మార్‌)లు వరుసగా 56, 57, 58 ర్యాంకుల్లో ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top