
న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం!
‘నేషనల్ హెరాల్డ్’ రభస బుధవారమూ కొనసాగింది. పార్లమెంట్లో నిరసనను తీవ్రం చేసిన కాంగ్రెస్ ఈ అంశంపై వరుసగా రెండో
పార్లమెంటు ద్వారా బెదిరిస్తున్నారు
♦ కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణలు
♦ ‘నేషనల్ హెరాల్డ్’ అంశంపై రెండో రోజూ స్తంభించిన పార్లమెంట్
న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’ రభస బుధవారమూ కొనసాగింది. పార్లమెంట్లో నిరసనను తీవ్రం చేసిన కాంగ్రెస్ ఈ అంశంపై వరుసగా రెండో రోజూ సభాకార్యక్రమాలను స్తంభింపజేసింది. కాంగ్రెస్, టీఎంసీ సభ్యుల నిరసనలతో పలు వాయిదాల అనంతరం, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే రాజ్యసభను వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యనే లోక్‌సభలో కొంతవరకు సభాకార్యక్రమాలను నడిపించారు. ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని, సొంతపార్టీ వారికి ఒక చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టాన్ని అనుసరిస్తోందంటూ కాంగ్రెస్, పార్లమెంట్ ద్వారా న్యాయవ్యవస్థను భయపెట్టాలని, బెదిరించాలని కాంగ్రెస్ కోరుకుంటోందంటూ బీజేపీ ఆరోపణల పదును పెంచాయి.
‘ప్రధాని కార్యాలయం నేతృత్వంలో సాగుతున్న 100% రాజకీయ కక్ష సాధింపు కార్యక్రమం ఇద’ని రాహుల్ మీడియాతో అన్నారు. పార్లమెంటును ఉపయోగించుకుని న్యాయవ్యవస్థను భయపెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్న కేంద్రమంత్రి వెంకయ్య ఆరోపణలపై స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థను ఎవరు భయపెడ్తున్నారో అందరికీ తెలుసు’ అని ఎన్‌జేఏసీ చట్టాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసును మూసేయాలని సముచిత నిర్ణయం తీసుకున్న ఈడీ డెరైక్టర్‌ను వెంటనే మరో స్థానానికి బదిలీ చేశారని, ఆ తరువాత మరో డెరైక్టర్‌ను నియమించి, కేసును మళ్లీ తెరిపించారన్న కాంగ్రెస్ నేత ఆజాద్ రాజ్యసభలో తేల్చిచెప్పారు.
స్వపక్షానికో చట్టం.. విపక్షానికో చట్టం
నేషనల్ హెరాల్డ్ కేసుపై లోక్‌సభలో చర్చ జరిగింది. అది ప్రభుత్వ, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలతోనే ముగిసింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ నేత ఖర్గే లేవనెత్తారు. కాంగ్రెస్ నేతలైన హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, రాజస్తాన్ నేత అశోక్ గెహ్లాట్ తదితరులపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఒక రకం చట్టాన్ని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నేతలు సుష్మా, వసుంధర రాజె తదితరులపై చర్యలు చేపట్టకుండా మరో రకం చట్టాన్ని వర్తింపజేస్తున్నారని విమర్శించారు. తాము న్యాయవ్యవస్థకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఖర్గే మాట్లాడుతుండగా, సోనియాఆయనకు కొన్ని సూచనలు ఇస్తుండటం కనిపించింది. ఖర్గే ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. పార్లమెంటు ద్వారా జ్యుడీషియరీని భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అది జాతి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. యూపీఏ హయాంలోనే ఈ కేసు నమోదయిందని గుర్తు చేశారు. ఆ సమయంలో సుబ్రమణ్యస్వామి బీజేపీ సభ్యుడు కూడా కాదన్నారు. పార్లమెంటును సాగనివ్వకుండా చేస్తూ కాంగ్రెస్ పార్టీ మూకస్వామ్యాన్ని అనుసరిస్తోందని వెంకయ్యనాయుడు విమర్శించారు.
‘ఎవరికో కోర్టు సమన్లు జారీ చేస్తే.. దానికి పార్లమెంటుకు సంబంధం ఏంటి? మీరు న్యాయవ్యవస్థను బెదిరించాలని చూస్తున్నారు. మాకే సమన్లు పంపిస్తావా? నీకెంత ధైర్యం అని న్యాయవ్యవస్థనే సవాలు చేస్తున్నారు’ అంటూ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాగా, నేటి నుంచి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యనేతలతో సోనియా సమావేశమై చర్చించారు.