ఈ శతాబ్దిలో అతిపెద్ద స్కాం

ఈ శతాబ్దిలో అతిపెద్ద స్కాం - Sakshi


రూ. 500, రూ. 2,000 నోట్లను రెండు రకాలుగా ముద్రించారు

రాజ్యసభలో కాంగ్రెస్‌ ఆరోపణ




న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం విపక్షాల నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి. రూ. 500, రూ. 2,000 నోట్లను పెద్దసైజులో, చిన్నసైజులో రెండు రకాలుగా ముద్రించారని, ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణమని రాజ్యసభలో కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. గుజరాత్‌లో రాహుల్‌ గాంధీ వాహనంపై జరిగిన రాళ్ల దాడిపై లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపింది. అధికార విపక్షాల వాగ్యుద్ధంతో రెండు సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి.



అధికార పార్టీ కోసం అచ్చేశారు: సిబల్‌

రాజ్యసభ ఉదయం 11 గంటలకు మొదలవగానే కపిల్‌ సిబల్‌(కాంగ్రెస్‌) నోట్ల అంశాన్ని లేవనెత్తారు. ‘అధికార పార్టీ సభ్యుల కోసం ఒక రకాన్ని, ఇతరుల కోసం మరో రకాన్ని ముద్రించారు.. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు అర్థమైంది. నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడంలో విఫలం అయ్యారు’ అన్నారు.


ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అభివర్ణించారు. చెలామణిలోని కరెన్సీ విశ్వసనీయతకు భంగం కలిగిందని ఆనంద్‌ శర్మ, ఇది హేయమైన నేరమని ప్రమోద్‌ తివారీ ధ్వజమెత్తారు. ఏ దేశంలోనూ ఒక నోటు రెండు సైజుల్లో లేదని ఎన్డీఏ కూటమిలోని జేడీయూ సభ్యుడు శరద్‌ యాదవ్‌ కూడా అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియాన్‌ సహా పలువురు విపక్ష సభ్యులు రెండు సైజుల్లో ముద్రించిన రూ. 500 నోట్లను సభలో ప్రదర్శించారు. అయితే జైట్లీ ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వలేదు.



మీకు ఎక్కడ దొరికాయి?: నక్వీ

విపక్ష ఆరోపణలను మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీలు ఖండించారు. నోట్ల రద్దు వల్ల అవినీతిపరులు ఇబ్బందిపడడంతో కాంగ్రెస్‌ గందరగోళం సృష్టిస్తోందని నక్వీ ఎదురుదాడి చేశారు. రెండు రకాల నోట్లు విపక్ష సభ్యులకు ఎక్కడ లభించాయని ప్రసాద్‌ ప్రశ్నించారు. చర్చకు ప్రత్యేక నోటీసు ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ విపక్ష సభ్యులకు సూచించారు. గందరగోళం సద్దుమణగకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.


తర్వాత సిబల్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. రూ. 500 నోటు ప్రామాణిక వెడల్పు, పొడవు కొలతలు 66 ఎంఎం గీ 150ఎంఎం. అయితే కొన్ని నోట్లు పొడవు 151ఎంఎం, 153 ఎంఎంగా ఉంది. ఆర్బీఐ ప్రకారం.. రూ. 2,000 నోటు సైజు 66ఎంఎం గీ 166 ఎంఎం కాగా కొన్ని నోట్ల పొడవు 167 ఎంఎంగా ఉంది. ఎడమ, కుడి, పైభాగం, కిందిభాగం సైజుల్లో, డిజైన్లలోనూ తేడాలు ఉన్నాయి’ అని వెల్లడించారు.  



ఆ నోట్లవి ప్రత్యేక కొలతలు: ప్రభుత్వం

పెద్ద నోట్ల సైజులు ప్రత్యేకమైనవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి మేఘ్‌వాల్‌ రాజ్యసభకు బదులిచ్చారు. ‘ఒక్కో విలువ గల బ్యాంకు నోటుకు ప్రత్యేక కొలతలు ఉన్నాయి. రూ.500 నోటు కొలతలు 66ఎంఎం గీ 150 ఎంఎం కాగా రూ. 2,000 నోటు సైటు కొలతలు 66ఎంఎంగీ 166 ఎంఎం’ అని తెలిపారు.



రాహుల్‌ చనిపోయేవారు: కాంగ్రెస్‌

గతవారం గుజరాత్‌ పర్యటనలో తమ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై జరిగిన దాడిలో ఆయనకు రాయి తగిలి ఉంటే చనిపోయేవారని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాహుల్‌పై హత్యాయత్నాలు జరిగాయి. ఆయనకు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.


ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా? కశ్మీర్‌లో ఉగ్రవాదులు రాళ్లు రువ్వుతారని అంటారు. మరి గుజరాత్‌లోని బీజేపీ కార్యకర్తలు ఉగ్రవాదులుగా మారారా?’ అని ప్రశ్నించారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ ఇస్తూ... ‘రాహుల్‌ తన 121 పర్యటనలకు గాను 100 పర్యటనల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు వాడలేదు.. విదేశీ పర్యటనల్లోనూ ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు. భద్రత లేకుండా ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏం దాచాలనుకుంటున్నారు? రాహుల్‌ తన భద్రతను తానే నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top