విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం! | Sakshi
Sakshi News home page

విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం!

Published Thu, Jan 7 2016 2:20 AM

విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం!

అణుబాంబుకన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రభావం
 
 ప్రపంచమంతా అణ్వాయుధ తయారీ, వినియోగంపై నియంత్రణ సాధించేందుకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానానికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా బుధవారం హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. ఈ బాంబు అత్యంత శక్తివంతమైనది. రెండో ప్రపంచయుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి లపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కన్నా ఈ బాంబు వెయ్యిరెట్లు శక్తివంతమైనది. అయితే అమెరికా ప్రయోగించింది అణుబాంబు. కేంద్రక విచ్ఛిత్తి సూత్రం(న్యూక్లియర్ ఫిషన్) ద్వారా పనిచేస్తుంది. హైడ్రోజన్ అణువు విడిపోవటం ద్వారా శక్తి ఉద్గారం అవుతుంది. కానీ.. హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం(న్యూక్లియర్ ఫ్యుషన్) ద్వారా రూపొందిస్తారు.

 హైడ్రోజన్ అణువులు వేగంగా వచ్చి ఒకదానితో మరొకటి ఢీకొనటం ద్వారా పెద్దమొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుంది. సూర్యుడిలో శక్తి పుట్టుకకు కారణం కూడా ఈ కేంద్రక సంలీనం చర్యే. హైడ్రోజన్, హీలియం అణువులు ఒకదానితో ఒకటి ఢీకొనటం ద్వారా విపరీతమైన శక్తితోపాటు.. పెద్దమొత్తంలో కాంతి వెలువడుతుంది. హైడ్రోజన్ బాంబు పేలుడు తీవ్రతకు మైళ్ల దూరంలో ఉండే భవనాలు సైతం నేలమట్టమవుతాయి.

 ద్వీపమే తుడిచిపెట్టుకుపోయింది.. 1952లో అమెరికా జరిపిన తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష ధాటికి పసిఫిక్ మహా సముద్రంలోని ఓ ద్వీపం మొత్తం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయిందంటే దీని ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు సామర్థ్యం 15 కిలోటన్నులు. ఈ పేలుడు కారణంగా దాదాపు 211 అడుగుల వెడల్పయిన అగ్నిగోళం ఏర్పడింది. దీని ప్రభావంతో.. 82వేల మంది మరణించగా.. దాదాపు 2.18 మైళ్ల విస్తీర్ణంలో తీవ్రమైన రేడియోధార్మికత ఏళ్లతరబడి కొనసాగింది. 

ప్రపంచం చవిచూసిన తొలి అణువిధ్వంసం ఇదే. నాగసాకిపై 20 కిలోటన్నుల సామర్థ్యమున్న అణుబాంబును ప్రయోగించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, రష్యాలు పోటాపోటీగా అణ్వాయుధ నిల్వలను పెంచుకున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం అమల్లోకి రావడంతో అగ్రరాజ్యాలు తమవద్ద ఉన్నఅణ్వాయుధాలను తగ్గించుకున్నాయి. ఇప్పటికీ అమెరికా, రష్యాల వద్ద పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలున్నాయి. ఫ్రాన్స్ (300), యునెటైడ్ కింగ్‌డమ్ (225), చైనా (260), ఉత్తర కొరియా (8), భారత్ (100), పాకిస్థాన్ (110), ఇజ్రాయెల్ (80) అణుబాంబులు కలిగి ఉన్నట్లు ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ తెలిపింది.
     - సాక్షి, హైదరాబాద్

Advertisement
Advertisement