కశ్మీర్‌ పోలీసులపై ‘హిజ్బుల్‌’ పంజా

Terrorists abduct family members of 7 policemen in south Kashmir - Sakshi

11 మంది కుటుంబ సభ్యుల కిడ్నాప్‌: విడుదల

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో    బలగాల కుటుంబసభ్యులను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. షోపియాన్, కుల్గామ్, అనంతనాగ్, అవంతిపొరా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి రాష్ట్ర పోలీస్‌ అధికారుల కుటుంబీకులైన 11 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌లు తామే చేసినట్లు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ ప్రకటించింది. ఈసారికి మాత్రం వారిని ప్రాణాలతో వదులుతున్నట్లు స్పష్టం చేసింది. దక్షిణ కశ్మీర్‌లో గురువారం అర్ధరాత్రి పోలీస్‌ అధికారుల ఇళ్లపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 11 మంది కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేశారు.

షోపియాన్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు పోలీస్‌ అధికారులు చనిపోవడంతో భద్రతాబలగాలు ఉగ్రవాదుల ఇళ్లపై దాడిచేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సలాహుద్దీన్‌ కొడుకు షకీల్‌ను గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసిన కొన్ని గంటల్లో ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను కిడ్నాప్‌ చేశారు. ఘటనపై కశ్మీర్‌ పోలీస్‌శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం పోలీస్‌ అధికారుల కుటుంబ సభ్యులు ఏడుగురు కిడ్నాప్‌ అయ్యారని తెలిపారు. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తామన్నారు.

మా బాధ తెలియాలనే కిడ్నాప్‌ చేశాం
పోలీస్‌ అధికారుల కుటుంబీకులు 11 మందిని తామే కిడ్నాప్‌ చేశామని హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కశ్మీర్‌ చీఫ్‌ రియాజ్‌ నైకూ ప్రకటించాడు. ‘అమాయకులైన పిల్లలను ఎత్తుకెళ్తే తల్లి పడే బాధ మీకు తెలియడానికే కిడ్నాప్‌ చేశాం. మేం మిమ్మల్ని(పోలీసులను) చేరుకోగలమని చెప్పేందుకే ఈ పని చేశాం. మీ కస్టడీలోని మా బంధువులను 3 రోజుల్లో విడిచిపెట్టండి. లేదంటే మీ కుటుంబాలు లోయలో ఇక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈసారి మీ కుటుంబీకుల్ని ప్రాణాలతో సగౌరవంగా విడిచిపెట్టాం’ అని ఆడియోలో హెచ్చరించాడు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ముందువరుసలో కశ్మీరీ పోలీసులు ఉండటంపై నైకూ∙అసహనం వ్యక్తం చేశాడు. నెలరోజుల్లోగా ఉద్యోగాలను విడిచిపెట్టివెళ్లేలా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తామని నైకూ స్పష్టం చేశాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top