జమ్మూలో ఉగ్రదాడి | Terrorist attack in Jammu | Sakshi
Sakshi News home page

జమ్మూలో ఉగ్రదాడి

Nov 30 2016 2:41 AM | Updated on Oct 22 2018 8:44 PM

జమ్మూలో ఉగ్రదాడి - Sakshi

జమ్మూలో ఉగ్రదాడి

సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. జమ్మూలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముష్కరులు భారీ దాడులకు తెగబడ్డారు.

పోలీసు దుస్తుల్లో ఆర్మీ యూనిట్‌లోకి చొరబాటు
- కాల్పుల్లో మేజర్ సహా ఏడుగురు సైనికుల ప్రాణత్యాగం
- ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
- చొరబాటుకు యత్నించిన మరో ముగ్గురు ఉగ్రవాదుల హతం
 
 జమ్మూ: సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. జమ్మూలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముష్కరులు భారీ దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో ఒక మేజర్ సహా ఏడుగురు సైనిక సిబ్బంది అమరులయ్యారు. బీఎస్‌ఎఫ్ డీఐజీతోపాటు మరో 8 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్ జావెద్ బజ్వా బాధ్యతలు స్వీకరించిన రోజే ఇవి జరిగాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారాల్లో మంచి పట్టున్న బజ్వా.. ఇది భారత్‌కు పంపిన హెచ్చరిక అని హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కే సింగ్ చెప్పారు.

 పోలీసుల దుస్తుల్లో ప్రవేశించి..
 మంగళవారం తెల్లవారుజామున కొంతమంది సాయుధ ఉగ్రవాదులు పోలీసుల దుస్తుల్లో నగ్రోటాలోని ఆర్మీ ఆర్టిలరీ విభాగంలోకి  ప్రవేశించారు. గ్రెనేడ్లు విసురుతూ ఆర్మీ మెస్ కాంప్లెక్స్‌లోకి చొరబడి అక్కడున్న సెంట్రీలపై కాల్పులు జరిపారు. తొలుత జరిపిన కాల్పుల్లో ఒక అధికారితోపాటు మరో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. తర్వాత ఉగ్రవాదులు అధికారులు, వారి కుటుంబాలున్న రెండు భవనాల్లోకి చొరబడ్డారు. దీంతో ‘గృహనిర్బంధం లాంటి పరిస్థితి’ నెలకొందని సీనియర్ అధికారి చెప్పారు. సైన్యం వెంటనే స్పందించి ఆపరేషన్ చేపట్టి అక్కడున్న అందరినీ క్షేమంగా రక్షించింది. అక్కడ 12 మంది సైనికులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చంటిబిడ్డలున్నారు. ఈ సహాయక ఆపరేషన్‌లో ఒక అధికారితోపాటు మరో ఇద్దరు జవాన్లు ప్రాణత్యాగం చేశారు. సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది.

 అమరులు వీరే..: కాల్పుల్లో అమరులైన ఇద్దరు అధికారులను మహారాష్ట్రకు చెందిన మేజర్ గోసవి కునాల్ మన్నదిర్ (33), బెంగళూరుకు చెందిన మేజర్ అక్షయ్ గిరీశ్ కుమార్ (31)గా గుర్తించారు. వీరమరణం పొందిన సైనికుల్లో పంజాబ్‌కు చెందిన హవిల్దార్ సుఖ్‌రాజ్ సింగ్ (32), మహారాష్ట్రకు చెందిన లాన్‌‌స నాయక్ కదం సంభాజీ (32), రాజస్తాన్‌కు చెందిన గ్రెనేడియర్ రాఘవేంద్ర సింగ్ (28), నేపాల్ ఖొటాంగ్‌కు చెందిన రైఫిల్‌మాన్ అసిమ్ రాయ్ (32) ఉన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.   

 చొరబాటు భగ్నం..: మరో ఘటనలో, రామ్‌గఢ్ సెక్టార్‌లో పాక్ ఉగ్రవాదుల చొరబాటును బీఎస్‌ఎఫ్ భగ్నం చేసి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అర్ధరాత్రి దాటాక ఉగ్రవాదులు జవాన్లపైకి గ్రెనేడ్లు విసరడంతోపాటు కాల్పులు జరిపారు. దీంతో ముష్కరులు తలదాచుకునేందుకు దగ్గర్లోని బంకర్‌లోకి వెళ్లారు. తెల్లవారేవరకు అక్కడి నుంచి కాల్పులు జరిపారు. అప్పటిదాకా నిఘా ఉంచిన బీఎస్‌ఎఫ్ బలగాలు తదనంతరం ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపారుు. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు రక్షణగా పాక్ బలగాలు కూడా కాల్పులు జరిపాయని బీఎస్‌ఎఫ్ తెలిపింది. ఈ ఘటనల్లో బీఎస్‌ఎఫ్ జమ్మూ డీఐజీ బీఎస్ కసనా, ఇండియా రిజర్వ్ బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ సరబ్‌జిత్ సింగ్, కానిస్టేబుళ్లు వైభవ్, శ్యామల్ అహిర్వార్ గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల నుంచి 18 మేగజీన్లు, 25 కాట్రిడ్‌‌జలు, మూడు అత్యాధునిక బాంబులతో కూడిన బెల్టులు, ఐదు ఐఈడీలు, వైర్‌లెస్ సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని మట్టుబెట్టకుండా ఉండి ఉంటే భారీ నష్టం వాటిల్లేదని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి చెప్పారు.
 
 అధికారుల సతీమణుల తెగువ

 నగ్రోటాలోని ఆర్మీ క్వార్టర్లలో ఉంటున్న ఇద్దరు అధికారుల సతీమణులు చూపిన అసాధారణ తెగువ భారీ సంక్షోభాన్ని తప్పించింది. పోలీసు దుస్తుల్లో భారీ ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు.. ఆర్మీ కుటుంబాలు నివసించే క్వార్టర్లలోకి చొరబడి సైనికుల, అధికారుల కుటుంబాలను బందీలుగా పట్టుకోవాలని భావించారు. అరుుతే తమ చంటిబిడ్డలతో ఉన్న ఈ మహిళలు.. వారి పాచిక పారనీయకుండా అడ్డుకున్నారు. ‘ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో వీరి భర్తలు నైట్‌డ్యూటీలో ఉన్నారు. ఉగ్రవాదులు వారి ఇళ్లను బద్దలుకొట్టి లోపలికి చొరబడటానికి యత్నించారు. అయితే, అధికారుల భార్యలు అందుబాటులో ఉన్న వస్తువులను అడ్డుపెట్టి ముష్కరులను లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు’ అని సైనికాధికారి ఒకరు చెప్పారు. వీరు అప్రమత్తమై స్పందించకుండా ఉండి ఉంటే ఉగ్రవాదులు అందరినీ బందీలుగా మార్చి భీకర నష్టం కలిగించేవారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement