ఛాయ్‌వాలా బిడ్డ.. భారతీయ వాయుసేనలో..

Tea Vendor Daughter Gets Job In IAF Flying Squad - Sakshi

భోపాల్‌ : భారత వాయుసేనలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఛాయ్‌వాలా కూతురి కల నెరవేరింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఆంచల్ గంగ్వాల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌)లో ఫ్లయింగ్ బ్యాచ్‌కి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఏఎఫ్‌సీఏటీ పరీక్షకు హాజరవ్వగా అందులో ఎంపికైన 22 మంది ఆంచల్‌ ఒకరు. ఆంచల్‌ ఎఫ్‌సీఏటీ పరీక్షను ఎదుర్కొవడం ఇది ఆరోసారి.

తొలి ఐదు ప్రయత్నాల్లో ఆమె రాత పరీక్ష అనంతర టెస్టుల్లో విఫలం చెందారు. ఆంచల్ తండ్రి సురేశ్ గంగ్వాల్ నీముచ్‌ బస్టాండ్‌లో టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వీరంతా చదువులో రాణించడంతో ఆర్థికంగా పరిస్థితులు బాగోలేకున్నా అప్పులు చేసి మరీ చదివించారు. ఆంచల్‌ చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు.

ఉత్తరాఖండ్ వరదల సమయంలో భారత సైన్యం చూపిన తెగువను చూసి స్ఫూర్తి పొందిన ఆంచల్‌ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తి అయ్యాక పోటీ పరీక్షలకు ఆమె ఇండోర్‌లో కోచింగ్‌ తీసుకుని సన్నద్ధమయ్యారు. వరుసగా పరీక్షలు రాయగా పోలీసు శాఖలో ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. అందులో ట్రైనింగ్‌లో ఉండగా లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం రావడంతో ఎయిర్‌ఫోర్స్‌కు సాధన చేయొచ్చనే ఉద్దేశంతో అందులో చేరిపోయారు.

ఎంతో శ్రమకోర్చి ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలన్న తన కలను నెరవేర్చుకుంది. ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్ బ్రాంచ్‌కి ఎంపికైన ఆంచల్‌ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు అభినందనలు వెల్లువలా వస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top