కేంద్రంలో వంద రోజుల నరేంద్ర మోడీ సర్కార్ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ తారిఖ్ అన్వర్ అన్నారు.
ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్
నాగపూర్: కేంద్రంలో వంద రోజుల నరేంద్ర మోడీ సర్కార్ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ తారిఖ్ అన్వర్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశంలో ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయిందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ధరలు ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా తన ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో మోడీ ప్రభుత్వం దేశంలో లౌకికత్వానికి భంగం కలిగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంపై మాట్లాడుతూ.. విదేశీ అతిథులు ఎవరైనా మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ర్పపతి, ప్రధాన మంత్రితోపాటు ప్రతిపక్ష నేత కూడా ఉండటం సంప్రదాయమని ఆయన అన్నారు. అలాగే లోక్‌పాల్, సీబీఐ చీఫ్, దేశ ప్రధాన న్యాయమూర్తి నియామకం సమయంలో ప్రతిపక్ష నేత పాత్ర చాలా కీలకమని, అయితే అటువంటి పదవి విషయంలో వారి వైఖరి నిరంకుశంగా ఉందన్నారు. మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.