ప్రధాన న్యాయమూర్తే సుప్రీం!

Supreme Court wonders how its two-judge bench usurped powers of CJI - Sakshi

రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తిదే

తేల్చిచెప్పిన సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం

‘జడ్జీల పేరుతో లంచం’ కేసు విచారణలో హైడ్రామా

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానంలోని సీనియర్‌ న్యాయమూర్తుల్లో నెలకొన్న విభేదాలు తెరపైకి వచ్చాయి. ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇష్రాత్‌ మస్రూర్‌ ఖుదూసిపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ గురువారం జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ జే చలమేశ్వర్‌.

ఈ కేసు విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్లైన ఐదుగురు న్యాయమూర్తులతో ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేసు విచారణ సందర్భంగానే.. సంబంధిత పిటిషన్‌ వేసిన ఎన్జీవో  ‘క్యాంపెయిన్‌ ఫర్‌ జ్యుడీషియల్‌ అకౌంటబులిటీ’, న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ఆరోపణలున్నాయని వాదించారు. అనూహ్యంగా శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమైన సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇచ్చిన ఆదేశాలను, ఆయన ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే ఉంటుందని, ఆయనే ఈ ఉన్నత న్యాయస్థానానికి అధిపతి అని స్పష్టం చేసింది. ద్విసభ్య లేదా త్రిసభ్య ధర్మాసనాలు ఓ నిర్ధిష్ట బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ సీజేఐని ఆదేశించలేవని స్పష్టం చేసింది. అలాగే, ఏ న్యాయమూర్తి కూడా సీజేఐ కేటాయించకుండా, సొంతంగా కేసులను విచారించకూడదని పేర్కొంది. న్యాయస్థానానికి అధిపతి అయిన సీజేఐకే ధర్మాసనాల ఏర్పాటు, అవి విచారణ జరిపే అంశాల కేటాయింపు అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది. ఆ విధానం న్యాయవ్యవస్థ క్రమశిక్షణ, న్యాయస్థానం మర్యాద అని పేర్కొంది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆదేశాలైనా చెల్లబోవని సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా స్పష్టం చేశారు. జడ్జీల పేరుతో లంచం అంశాన్ని రెండు వారాల తర్వాత సరైన బెంచ్‌కు కేటాయిస్తామన్నారు.

ప్రత్యేకంగా ఏ న్యాయమూర్తి పేరును ప్రస్తావించకుండానే.. ‘రోజూ వందలాదిగా పిటిషన్లు దాఖలవుతుంటాయి. ఇలా ఆదేశాలిస్తూ పోతే.. కోర్టులను నడపలేం’ అని వ్యాఖ్యలు చేశారు. కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూరి, ఇతర సీనియర్‌ న్యాయవాదులతో నిండిపోయిన కోర్టు హాళ్లో ఈ విచారణ సాగింది. ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆగ్రహానికి లోనయ్యారు. గట్టిగట్టిగా మాట్లాడుతూ.. ఒడిశా హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సీజేఐ పేరు ఉందని, ఈ విచారణ బెంచ్‌ నుంచి జస్టిస్‌ మిశ్రా తొలగి పోవాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో చదవాలని, గట్టిగట్టిగా మాట్లాడొద్దని జస్టిస్‌ మిశ్రా భూషణ్‌ను హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వస్తుం దని మందలించారు. దానిపై, ధిక్కరణ నోటీసులు ఇవ్వండని భూషణ్‌ సమాధానమిచ్చారు. తనను మాట్లాడనివ్వడం లేదంటూ కోర్టు హాలు నుంచి వెళ్లిపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top