వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

The Supreme Court Says Adultery prima facie violative of right to equality - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్‌ షైనీ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశాడు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ ధర్మాసనంలో ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందూ మల్హోత్రా తదితర న్యాయమూర్తులు ఉన్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్‌ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దీనిని పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. పెళ్లి రద్దుకు దారితీసేవిధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు. 

సెక్షన్‌ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్‌ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్‌ వాదిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top