‘ఏదైనా అద్భుతం జరగొచ్చు.. ప్రయత్నం మానకండి’

Supreme Court Said the Hunt Must Continue In Meghalaya Mine - Sakshi

న్యూఢిల్లీ : మేఘాలయలోని ఈస్ట్‌ జైంతియా హిల్స్‌ జిల్లా బొగ్గు గనిలో చిక్కుకుపోయిన 15 మంది కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘మీ సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉండండి. ఏదైనా అద్భుతం జరిగి అందరూ లేదా వాళ్లలో కనీసం కొందరైనా బతికి ఉండొచ్చేమో’? అని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకోసం అవసరమైన నిపుణుల సహాయం కూడా తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ సందర్భంగా అక్రమంగా గనుల తవ్వకాలు చేపడుతున్న వారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అసలు అక్రమంగా గనులు తవ్వేందుకు ఎవరు అనుమతులు ఇస్తున్నారని న్యాయస్థానం మేఘాలయ అధికారులను ప్రశ్నించింది.

అధిక శక్తి గల పంపుల ద్వారా గనిలో నుంచి ఇప్పటి వరకు 28 లక్షల లీటర్ల నీటిని బయటకు తోడినట్లు మేఘాలయ అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే.. దగ్గర్లో ఉన్న నది కారణంగా నీటి స్థాయిలు ఏమాత్రం తగ్గడం లేదని సహాయక చర్యలకు ఇది తీవ్ర ఆటంకంగా మారిందని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం నేవీ సిబ్బంది రిమోర్ట్‌లతో పని చేసే ఐదు వాహనాలతో రంగంలోకి దిగి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అక్రమంగా గని తవ్వకం చేపట్టిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఒడిశా అగ్నిమాపక దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, రాష్ట్ర అగ్నిమాపక దళంతో పాటు ఇతర కంపెనీలకు చెందిన సిబ్బంది కూడా నిరంతరం గని దగ్గర సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

డిసెంబరు 13న ఈస్ట్‌ జైంతియా హిల్స్‌ జిల్లాలో పలువురు కూలీలు అక్రమంగా బొగ్గు గని తవ్వేందుకు వెళ్లగా.. అదే సమయంలో వరదలు సంభవించి గనిలోకి నీరు చేరింది. అదృష్టవశాత్తూ ఐదుగురు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 15 మంది అందులో చిక్కుకుపోయారు. దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. కూలీల జాడ తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top