పాక్‌ పాటను కాపీ కొట్టిన ఎమ్మెల్యే

Social Media Attacks on BJP MLA Rajasingh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యానికి నివాళిగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14వ తేదీన ఓ పాటను విడుదల చేస్తున్నానని తెలంగాణ బేజీపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ట్విట్టర్‌ సాక్షిగా శుక్రవారం నాడు గొప్పగా ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన స్వయంగా పాడిన పాటను రిలీజ్‌ చేశారు. అయితే ఆశించినట్లుగా ప్రశంసల జల్లు కురవకుండా, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో విమర్శల జడివానా మొదలయింది. ఆ తిట్ల పరంపర ఒక్క భారతీయుల నుంచే కాకుండా సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్థాన్‌ ప్రజల నుంచి కూడా హోరెత్తుతోంది. 

అందుకు కారణం పాకిస్థాన్‌ మిలటరీ మీడియా (ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌) పాకిస్థాన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 23వ తేదీన విడుదల చేసిన వీడియో సాంగ్‌న మక్కీకి మక్కీ కాపీ కొట్టడమే కారణం. కాకపోతే ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అని ఉన్న చోటల్లా ‘హిందుస్థాన్‌ జిందాబాద్‌’ అని మార్చారు. పాకిస్థాన్‌ పాటను సాహిర్‌ అలీ బగ్గా చాలా హద్యంగా పాడగా, మన చౌకీదార్‌ రాజాసింగ్‌ తన శక్తిమేరకు పాడారు. రాజాసింగ్‌ పాట్‌పై పాకిస్థాన్‌ మిలటరీ మీడియా డైరెక్టర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ‘పాటను కాపీ కొట్టావ్, బాగుంది! అలాగే నిజం మాట్లాడడాన్ని కూడా కాపీ కొడితే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. గత ఫిబ్రవరి నెలలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత్‌ చెబుతుండగా, అది అబద్ధమని భారత్‌ విమానాన్ని తాము కూల్చడం వల్లనే భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ తమకు చిక్కారని పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. అభినందన్‌ చిక్కడం ఎంత నిజమో, ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చడం అంతే నిజమని భారత్‌ వాదిస్తోంది. యుద్ధ విమానాన్ని కూల్చడం అబద్ధమని పాక్‌ ఇప్పటికీ ఖండిస్తోంది. ఇదే విషయమై నిజం చెప్పడం కాపీ కొట్టండంటూ గఫూర్‌ వ్యాఖ్యానించారు. రాజాసింగ్, పాక్‌ పాటను కాపీ కొట్టలేదని, దొంగిలించారని, ఆయనప్పటికీ ఆయన పాటలో వచనం అంత బాగా లేదని పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ హమీద్‌ మీర్‌ చమత్కరించారు. ఇది భారత సైన్యానికి నివాళి అర్పించడం కాదని, అవమానించడమని పలువురు సోషల్‌ నెటిజెన్లు విమర్శిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top