ఆరుగురు ఉగ్రవాదుల హతం

six terrarists killed in jammu kashmie encounter - Sakshi

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్లలో జవాను, పౌరుడు కూడా మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్‌ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్‌ వీరమరణం పొందగా, రయీస్‌ దార్‌ అనే పౌరుడు  మరణించారు.

అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్‌ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్‌ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.  మృతుల వివరాలు తెలియలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top