శ్రామిక రైళ్లు నడపడంలో అంతా కంగాళీ

Shramik Special Trains Mishandling - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం విధించిన నాలుగవ విడత లాక్‌డౌన్‌ కూడా మరో మూడు రోజుల్లో ముగియనుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వలస కార్మికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 29వ తేదీన నిర్ణయించి నేటికి దాదాపు నెల రోజులవుతోంది. అయినప్పటికీ వలస కార్మికుల తండాలు తరలి పోవడం ఇంకా పూర్తి కాలేదు. ప్రహసనం కొనసాగుతూనే ఉంది. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు)

వలస కార్మికుల తరలింపునకు రైళ్లను అనుమతిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, ఆ బాధ్యతను మాత్రం రాష్ట్రాల సమన్వయానికి వదిలేసింది. ఆ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆ సమస్యలపై ప్రతిపక్షం ప్రధానంగా విరుచుకు పడడంతో తప్పనిసరిగా కేంద్రం రంగంలోకి దిగాల్సి వచ్చింది. అప్పుడు కూడా వలస కార్మికుల టిక్కెట్‌ చార్జీలను ఎవరు భరిస్తారన్నది సమస్యగా పరిణమించిది. రాష్ట్రాలే భరించాలని చెప్పిన కేంద్ర రైల్వే శాఖ అందుకు పక్కా ప్రణాళికను రూపొందించలేక పోయింది. టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామంటూ, తొలుత, వారిని మాత్రమే అనుమతించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ జోక్యం చేసుకొని కార్మికుల టికెట్‌ ఖర్చులను తాము భరిస్తామంటూ ముందుకు వచ్చింది. ఆ విషయంలో ఆ పార్టీ కూడా ఆలస్యంగానే స్పందించింది.

రైళ్ల షెడ్యూల్‌ను సకాలంలో సరిగ్గా ఖరారు చేయక పోవడం, దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌కు వలస కార్మికులు వేలాదిగా తరలి రావడం, ప్రకటించిన రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా బయల్దేరడం, రైళ్లలో అన్న పానీయాలు అందుబాటులో లేక పోవడంతో గురువారం నాటికి గడచిన 48 గంటల్లో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించడం తెల్సిందే. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫారమ్‌ మీద చనిపోయిన తల్లి శవం మీద కప్పిన దుప్పటిని లాగుతూ ఆమెను లేపేందుకు ప్రయత్నిస్తున్న పసి బాలుడు ఉదంతం వీడియో రూపంలో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఆకలి, అన్నార్థుల చావులను కేంద్రం ఖండిస్తోంది. చనిపోయిన వారంతా వృద్ధులు, రోగులంటూ పేర్కొంది. మంచినీళ్లు దొరికే చోట కాకుండా నీళ్లు దొరకని చోట గంటలకొద్దీ రైళ్లను ఆపడం వల్లనే తాము ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామని రైల్వే ప్రయాణికులు పలు చోట్ల మీడియాతో వాపోయారు.

టైమ్‌ టేబుల్‌ లేక పోవడం వల్ల రైళ్లను విధిలేక ఆపాల్సి వస్తోందని, అన్న పానీయాలను అందించడం తమ డ్యూటీ కాదని, అది పౌర అధికారులు, ఎన్‌జీవో సంస్థల బాధ్యతని రైల్వే ఉన్నతాధికారులు తెలియజేశారు. రైలు టిక్కెట్లకు డబ్బుల్లేక, ఉన్నా అవి ఎప్పుడొస్తాయే, ఎప్పుడు వెళ్తాయో తెలియకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డు మార్గాన దొరికిన వాహనాల్లో, కాలినడకన ప్రాణాలకు తెగించి పోతున్న దృశ్యాలను చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో (పట్టాలపై పడుకున్న కూలీల మీది నుంచి గూడ్సు బండి దూసుకుపోవడం సహా) దాదాపు రెండు వందల మంది మరణించినట్లు జాతీయ మీడియా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో మే 31వ తేదీన ముగియనున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా? లేదా పొడిగిస్తారా? అన్న అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. (కరోనా కన్నా అవే ప్రమాదకరం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top