శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు

No Food And Water Aboard Shramik Special Trains - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అది మంగళవారం. సమయం ఉదయం నాలుగు గంటలు. ముంబై నుంచి బిహార్‌లోని కటియార్‌కు వలస కార్మికులను తీసుకొని బయల్దేరిన ప్రత్యేక శ్రామిక రైలు. ఏవో ఏడ్పులు వినిపించడంతో 34 ఏళ్ల మొహమ్మద్‌ కలీముల్లా హఠాత్తుగా నిద్ర లేచారు. 58 ఏళ్ల సయ్యన్‌ కుమార్‌ సింగ్‌ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌ స్టేషన్‌కు రైలు చేరుకోగా పోలీసులు వచ్చి కుమార్‌ సింగ్‌ మృతదేహాన్ని తీసుకుపోయారు. (వలస కార్మికులకు ఉపాధి ఎలా?)

కుమార్‌ సింగ్‌ కరోనా లక్షణాలతో చనిపోలేదని, ఆయన రోజువారి బీపీ, సుగర్‌ ట్యాబ్లెట్లు వేసుకునేందుకు పచ్చి మంచినీళ్లు కూడా దొరక్క పోవడంతో చనిపోయారని ఆయన సన్నిహితులు తెలిపారు. తాను ప్రయాణిస్తున్న రైల్లో మే 25వ తేదీన ఒక్క పూట భోజనం అందించారని, ఒక్క చుక్క నీరు కూడా ఎవరూ ఇవ్వలేదని కలీముల్లా ఆరోపించారు. అన్నం పెట్టకపోయినా ఫర్వాలేదని, మంచినీళ్లు ఇచ్చుంటే బాగుండేదని ఆయన వాపోయారు. మంగళవారం ఉదయం 6.15 గంటలకు ఆ రైలు వారణాసికి చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైలును నిలిపి వేశారు. ఆ సమయంలో కూడా అధికారులెవరూ మంచినీళ్లుగానీ, ఆహారంగానీ అందించలేదు. మంచినీళ్లు లేకపోతే కుమార్‌ సింగ్‌ లాగా తాము కూడా చనిపోతామని కలీముల్లా ఒంటి గంట ప్రాంతంలో సెల్‌ఫోన్‌ ద్వారా మీడియాకు అతికష్టం మీద తెలిపారు. దాహంతో నోరెండుకు పోవడంతో ఆయన నోటి నుంచి మాట సరిగ్గా రావడం లేదు. (‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ కన్నీటి కథ)

ఆ రైలు 36 గంటల్లో బిహార్‌లోని పాట్నాకు చేరుకోవాలి. మీడియా సంప్రతించేటప్పటికీ 40 గంటలు దాటిపోయింది. అయినా రైలు కనుచూపు మేరలోకి కూడా పోలేదు. ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. దాదాపు అన్ని శ్రామిక రైళ్లు గంటలు, రోజులు ఆలస్యంగా నడుస్తున్నాయని, వేలాది మంది వలస కార్మికులు అన్నపానీయాలు లేక అలమటిస్తున్న ఉదంతాలు మీడియా దృష్టికి వస్తున్నాయి. కొన్ని రైళ్లలో కార్మికులు పేలాలు బుక్కి కడుపు నింపుకుంటున్నారు. వలస కార్మికుల తిరుగు ప్రయాణం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు, రైలు ప్రమాదాల్లో 200 మందికిపైగా కార్మికులు మరణించారు. మే 25వ తేదీ వరకు 44 లక్షల ప్రయాణికులను తరలించేందుకు భారతీయ రైల్వే 3,274 ప్రత్యేక శ్రామిక రైళ్లను నడిపినట్లు ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top