
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో.. ప్రజలంతా ఇంటే పరిమితమైయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల కాలక్షేపం కోసం భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణంను కేంద్రం దూరదర్శన్‌లో ప్రసారం చేస్తోంది. అయితే ప్రజలకు డిమాండ్ మేరకు ప్రజల ఆదరాభిమానాలు పొందిన మరిన్ని సీరియల్స్‌ను బుల్లి తెరపైకి తీసుకురావాలని కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖ సంకల్పించింది. దీనిలో భాగంగానే చిన్నపిల్లలకి ఇష్టమైన శక్తిమాన్ సీరియల్‌ను ప్రజల ముందుకు తీసుకురానుంది. (ప్రజల ముందుకు రామాయణం)
ఈ మేరకు శక్తిమాన్ హీరో ముఖేష్‌కన్నా మాట్లాడుతూ ‘కరోనా వచ్చిన ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మీ అందరికీ భారత ఇతిహాస గ్రంథమైన రామాయణం ఒకేసారి చూసే అవకాశం మరోసారి లభించింది. దీంతోపాటు మీ అందరికి ఎంతో నచ్చిన శక్తిమాన్ కూడా దూరదర్శన్‌లో ప్రసారం కాబోతుంది. అయితే ఎప్పటి నుంచి ఏ సమయంలో ప్రసారం కాబోతుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తూ ఉండండి’ అని తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. కాగా శక్తిమాన్ తొలిసారి 1997లో ప్రారంభమై 2005 వరకు ప్రసారమైన విషయం తెలిసిందే.