
ముఖ్యమంత్రి చాప కిందకు నీళ్లు?
తమిళనాడు రాజకీయాలలో మళ్లీ అనిశ్చితి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడప్పాడి పళనిస‍్వామి ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడు రాజకీయాలలో మళ్లీ అనిశ్చితి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడప్పాడి పళనిస‍్వామి ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మరోవైపు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోలేక నిరాశలో ఉన్న పన్నీర్ సెల్వం క్యాంపులో మళ్లీ ఉత్సాహం మొదలైంది. జూన్ నెలలో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ స్మారకార్థం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో సెమినార్లు, డిబేట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ పేరుతో అటు పళనిస్వామి వర్గం నుంచి చీలిక తీసుకురావాలని పన్నీర్ వర్గం భావిస్తోంది. శశికళ వర్గం కూడా పళనిస్వామి మీద అసంతృప్తితో ఉండటం లాంటివి పన్నీర్‌కు కలిసొచ్చే అంశాలు. ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడం, ఆ తర్వాత రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడం లాంటి పరిణామాలతో శశికళ క్యాంపు ఖంగుదింది.
శశికళ క్యాంపులో చీలికలు రావడం, ఆదాయపన్ను శాఖ దాడులు లాంటి విషయాలు ప్రభుత్వంలో అస్థిరతకు కారణమయ్యాయని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోంది. సీనియర్ నాయకుడు ఇ. మధుసూదనన్, మాజీమంత్రి పాండ్యరాజన్, ఎంపీ వి. మైత్రేయన్, మాజీ మంత్రి మునుసామి, మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ లాంటివాళ్లంతా కలిసి పన్నీర్ సెల్వంతో సమావేశమయ్యారు. వ్యూహాల గురించి చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారని, బహుశ బుధవారం నాడు పెద్ద ప్రకటన ఏదో ఒకటి రావచ్చని అంటున్నారు. శశికళ వర్గం నుంచి కొంతమంది సీనియర్ మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు వచ్చి పన్నీర్‌సెల్వం వర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. శశికళ కుటుంబ సభ్యులు పార్టీలో ఉండకూడదని పన్నీర్ వర్గం గట్టిగా చెబుతోంది. తాజా పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు సీనియర్‌నాయకుడు మైత్రేయన్ నిరాకరించారు. నాయకులు రావాలనుకుంటే వస్తారని, వాళ్లు రావాలని తాము ఎదురు చూడట్లేదని చెప్పారు. వాళ్ల విషయం వాళ్లే నిర్ణయించుకుంటారన్నారు.