
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లోని బనారస్ హిందూ యూనివర్శిటీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థినిలపై వేధింపుల సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్శిటీ ముఖ్య అధికారి డాక్టర్ గిరీష్ చంద్ర త్రిపాఠి పదవి నుంచి వైదొలిగారు. మంగళవారం సాయంత్రం ఆయన తన రాజీనామాను అధికారులకు సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన విశ్వవిద్యాలయ అధికారులు త్వరలోనే ఈ స్థానాన్ని భర్తి చేయనున్నట్టు చెప్పారు. తాత్కాలికంగా బీహెచ్‌యూ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఎంకే సింగ్ కు అదనంగా ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.
విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా యూపీ సర్కారుపై విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు మోహన్ ప్రకాష్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పోలీసు అధికారులను వివరణ కోరారు. అయితే విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం బయటికి వాళ్లే ఈ హింసకు కారణమని ఆరోపించారు.
కాగా, యూనివర్శిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థినిని ముగ్గురు యువకులు వేధించిన ఘటనకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఈ ఘటనలో విద్యార్థినులతోపాటు పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. వెయ్యిమంది ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో సెమిస్టర్ సెలవులను ముందస్తుగానే వర్శిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే.