ఛండీగడ్‌ గార్డుకు సలాం.. ఏం చేశాడంటే

Security Guard at Chandigarh Theatre Returns Diamond Bracelet Worth Lakhs - Sakshi

చండీగఢ్ : పది రూపాయలు  దొరికినా గుట్టుగా జేబులో వేసుకునే ఈ రోజుల్లో చండీగడ్‌లో ఒక  సినిమా హాల్లోని  సెక్యూరిటీ గార్డు  చూపించిన నిజాయితీ  ఆదర్శంగా నిలిచింది.  లక్షల రూపాయల విలువ చేసే డైమండ్‌  బ్రాస్‌లెట్‌ను  తిరిగి నిజమైన యజమానురాలికి ఇచ్చిన వైనం సోషల్‌ మీడియాలో ప్రశంసలు దక్కించుకుంటోంది.

వివరాల్లోకి వెళితే..వివాహ వార్షికోత్సవ కానుకగా భర్త బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్‌ బ్రాస్‌లెట్‌ను మీనాక్షి గుప్తా సినీపోలిస్‌ సినిమా హాల్‌లో  పోగొట్టుకున్నారు. దీనికోసం వెతికి వెతికి నిరాశ చెందిన మీనాక్షి చివరి ప్రయత్నంగా సినీపోలిస్‌ థియేటర్‌లోని పోలీసులను సంప్రదించారు. ఆ ఆశే ఆమెకు అంతులేని సంతోషాన్ని మిగిల్చింది.  నిజాయితీగల, నిఖార్సైన  సెక్యూరిటీ గార్డును ప్రపంచానికి పరిచయం చేసింది.   

తన భర్త ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్‌ పోవడంతో చాలా షాకయ్యాననీ, కానీ గార్డు నిజాయితీ  తనకు అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చిందంటూ సోషల్‌ మీడియాలో వెల్లడించారు మీనాక్షి.  నాలుగు సంవత్సరాల క్రితం  దీని విలువ రూ. 2 లక్షలు అని తెలిపారు.

ఇంతకీ ఈ స్టోరీలోని రియల్‌ హీరో పేరు సూరజ్, చండీగఢ్ నివాసి. గత ఏడు నెలలుగా   సినీపోలిస్‌ సినిమా హాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.  ఈ సంద‍ర్భంగా ఆయన మాట్లాడుతూ షో అయిపోగానే ప్రతీ సీటును క్షుణ్ణంగా పరిశీలిస్తామని సూరజ్‌ చెప్పారు.  ప్రతీరోజు సెల్‌ఫోన్‌, బంగారు నగలు లాంటి విలువైన వస్తువులు దొరుకుతూనే ఉంటాయనీ వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి  పోగొట్టుకున్నవారికి అందిస్తామన్నారు.  నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది.. అప్పనంగా  వచ్చింది ఏదో ఒక రూపంలో పోతుందంటూ  సూరజ్‌  పేర్కొనడం విశేషం.

అంతేకాదు బ్రాసెలెట్‌ను జాగ్రత్తగా భద్రపరిచిన పెట్టిన సూరజ్‌..అడిగిన వెంటనే అలవోకగా మీనాక్షికి ఆ నగను స్వాధీనం చేయలేదు. దాని ఖరీదుకు సంబంధించిన బిల్లు, ఫోటో, ఆధార్‌కార్డు లాంటివి తీసుకుని  పూర్తిగా ధృవీకరించుకున్న తరువాత మాత్రమే అప్పగించడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top