ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి...
ముంబై: షిర్డీవాసులతోపాటు సాయిభక్తులకు శుభవార్త. ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలోని ములా డ్యాంతోపాటు శనిసింగణాపూర్, మెహరాబాద్‌లకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర పర్యాటక సంస్థ సహకారంతో మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంస్థ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్థ్ వర్మ వెల్లడించారు.
అహ్మద్‌నగర్ జిల్లాలోని ములా డ్యాంవరకు ఈ సేవలను అందిస్తామని, అందువల్ల సాయి భక్తులు వీలైనంత తక్కువ సమయంలో షిర్డీకి చేరుకోగలుగుతారన్నారు. గత నెల 25వ తేదీన ముంబై నుంచి లోణావాల మధ్య తాము ప్రారంభించిన సీప్లేన్ సేవలకు విశేష స్పందన లభించిందన్నారు. తాము ములా డ్యాం వరకూ ప్రారంభించనున్న తాజా సేవల వల్ల ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తులు అత్యంత తక్కువ సమయంలోనే చేరుకుంటారన్నారు. దీంతోపాటు నాసిక్‌లోని గంగాపూర్ డ్యాం, మహాబలేశ్వర్ సమీపంలోని ధూమ్ డ్యాంలకు కూడా త్వరలోనే సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామన్నారు.