breaking news
Juhu airport
-
మూడు పుణ్యక్షేత్రాలకు త్వరలో సీ ప్లేన్ సేవలు
ముంబై: షిర్డీవాసులతోపాటు సాయిభక్తులకు శుభవార్త. ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలోని ములా డ్యాంతోపాటు శనిసింగణాపూర్, మెహరాబాద్లకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర పర్యాటక సంస్థ సహకారంతో మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంస్థ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్థ్ వర్మ వెల్లడించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని ములా డ్యాంవరకు ఈ సేవలను అందిస్తామని, అందువల్ల సాయి భక్తులు వీలైనంత తక్కువ సమయంలో షిర్డీకి చేరుకోగలుగుతారన్నారు. గత నెల 25వ తేదీన ముంబై నుంచి లోణావాల మధ్య తాము ప్రారంభించిన సీప్లేన్ సేవలకు విశేష స్పందన లభించిందన్నారు. తాము ములా డ్యాం వరకూ ప్రారంభించనున్న తాజా సేవల వల్ల ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తులు అత్యంత తక్కువ సమయంలోనే చేరుకుంటారన్నారు. దీంతోపాటు నాసిక్‌లోని గంగాపూర్ డ్యాం, మహాబలేశ్వర్ సమీపంలోని ధూమ్ డ్యాంలకు కూడా త్వరలోనే సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామన్నారు. -
జుహూలో రన్‌వే నిర్మాణానికి ‘పచ్చ’ జెండా
సాక్షి, ముంబై: సముద్రంతీరంలోని జుహూ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. సముద్రంలో ఎలాంటి మట్టి వేయకుండా 800 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించేందుకు అనుమతి లభించింది.ఈ నిర్మాణం పూర్తయితే సముద్రతీరం సమీపంలో ఉన్న జుహూ విమానాశ్రయం నుంచి త్వరలో విమనాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం శాంత్రాకజ్ డొమెస్టిక్ విమానాశ్రయంపై పడుతున్న ట్రాఫిక్ భారం కొంతమేర తగ్గుతుంది. కొన్ని దశాబ్దాల కిందట నగరంలో మొట్ట మొదటిసారి జుహూ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా విమానాల సంఖ్య పెరిగిపోవడంతో శాంతాక్రజ్, ఆ తరువాత అంధేరిలోని సహార్ అంతర్జాతీయ విమానాశ్రాయాలను నెలకొల్పారు. ప్రస్తుతం జుహూ నుంచి చిన్న తరహా చార్టెడ్ విమానాలు, హెలికాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాశ్రయాన్ని జుహూ హెలిప్యాడ్‌గా పిలుస్తారు. సహార్, శాంతాక్రజ్ విమానాశ్రయాలపై పడుతున్న ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరమని అధికారులు ఆలోచిస్తుండగా ఎయిర్ అథారిటీ వర్గాలు జుహూ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని భావించాయి. జుహూలో రన్‌వే ఆధునిక విమానాల రాకపోకలకు అనుకూలంగా లేదు. రన్‌వే పొడవు పెంచాలని నిపుణులు సూచించడంతో 800 మీటర్ల రన్‌వే ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా సముద్రాన్ని పూడ్చి రన్‌వే ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లర్లు వేసి వంతెనపై రన్‌వే ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జుహూ విమానాశ్రయానికి పూర్వ వైభవం రానుంది.