ఉద్యోగాల్లోనూ ఎస్సీలది వెనక‘బాటే’

Scheduled Castes among worst sufferers of India’s job problem - Sakshi

    సామాజిక వివక్షే కారణం

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఎస్‌సీల ఉద్యోగ, ఉపాధి కోసం వివిధ పథకాల కింద వేల కోట్లు వెచ్చిస్తోంది. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలు గమనిస్తే ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఎస్‌సీలు వెనుకబడి ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక వివక్ష, సామాజిక–ఆర్థిక స్థాయి ఈ వెనకబాటుకు కారణాలని తెలుస్తోంది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం(ఎన్‌ఎస్‌ఎస్‌వో)2011–12 తర్వాత దేశంలో ఉద్యోగాల పరిస్థితిపై ఎలాంటి సర్వే చేయలేదు.అయితే అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మిగతా కులాల వారితో పోలిస్తే ఎస్‌సీలు ఉద్యోగాల విషయంలో వివక్షకు గురవుతున్నారని స్పష్టమవుతోంది.

వేతన కూలీలు 63%
ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2011–12 సర్వే ప్రకారం ఎస్‌సీలలో 63% వేతన కూలీలు (ఉద్యోగ భద్రతలేని చిన్నాచితకా పని చేసే వాళ్లు –అంటే ఇళ్లలో పని చేసేవారు, హమాలీలు మొదలైన వారు) గా పని చేస్తున్నారు. ఇది ఓబీసీల్లో 44%, ఉన్నత కులాల్లో 42%, ఇతర కులాల్లో46%గా ఉంది. ఈ వేతన కూలీల్లో కూడా దినసరి కూలీలుగా పని చేస్తున్న వారిలోనూ ఎస్సీలే అధికంగా ఉన్నారు. దేశ జనాభాలో ఎస్సీలు 16శాతం ఉంటే, దినసరి కూలీల్లో ఎస్‌సీలు 32 శాతం ఉన్నారు. ఇతర కులాల్లో ఇది 20–30 శాతానికి మించలేదు. కులం కారణంగా వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రైవేటు రంగం ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎస్సీల్లో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే 1.7 శాతం ఎక్కువ ఉంది. 1990ల నుంచి ఎస్సీల్లో నిరుద్యోగ రేటు శాతం మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటోంది. మన సమాజంలో తరతరాలుగా కొన్ని ఉద్యోగాలు ఉన్నత కులస్థులకని, మరి కొన్ని ఉద్యోగాలు నిమ్న జాతులకని నిర్దేశించడం జరిగింది.

ఉన్నత కులస్థుల ఉద్యోగాల్లోకి ఎస్సీలను తీసుకోవడానికి యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇక విద్య, నైపుణ్యం వంటివి కూడా   ఉద్యోగాల్లో ఎస్సీల వెనకబాటుకు కారణమవుతున్నా సామాజిక వివక్షే కీలక పాత్ర వహిస్తోంది. ఉన్నత కులస్తుల ఇళ్లలో వంటవాళ్లుగా, పనివాళ్లుగా, హోటళ్లలో సర్వర్లుగా, ప్రార్థనా స్థలాల నిర్మాణంలో కూలీలుగా ఎస్సీలను తీసుకోవడానికి విముఖత చూపుతున్నట్టు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ దళిత్‌ స్టడీస్‌ సర్వేలో తేలింది. ఉన్నత కులాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలకు ఉన్నత కులస్తులనే ఎంపిక చేస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఒక ఉద్యోగానికి సమాన అర్హతలున్న ఎస్‌సీ, ఇతర అభ్యర్ధులు దరఖాస్తు చేస్తే వారిలో ఉన్నత కులస్థులకే ఇంటర్వ్యూ పిలుపు వస్తోందని థోరట్‌ అండ్‌ అటెవెల్‌ సంస్థ అధ్యయనంలో తేలింది. ఉన్నత చదువులు చదివిన ఎస్సీల కంటే తక్కువ చదువున్న ఇతర కులస్థులకే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి ఆ సంస్థ వెల్లడించింది.

ఈ వివక్ష కారణంగా  ఉద్యోగాలు లభించక చాలా మంది ఎస్సీలు పేదలుగానే ఉండిపోతున్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ  లెక్కల ప్రకారం 2011–12లో ఎస్సీల్లో మూడింట ఒక వంతు మంది పేదలు కాగా ఓబీసీల్లో 20శాతం, ఇతర కులాల్లో 9 శాతం పేదలు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top