జిల్లాల్లో ‘పోక్సో’ ప్రత్యేక కోర్టులు

SC orders setting up of special courts in districts level - Sakshi

న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో) కింద 100కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన జిల్లాల్లో, పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర నిధులతో ఏర్పాటయ్యే ఈ కోర్టులు ప్రత్యేకంగా పోక్సో కేసులను మాత్రమే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి అవగాహన కల్పించేలా, అలాంటి నేరాలు శిక్షార్హమని తెలిపేలా ఒక చిన్న వీడియోను అన్ని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు చూపాలని ఆదేశించింది.

అన్ని టీవీ చానళ్లలోనూ తప్పనిసరిగా ఆ క్లిప్పింగ్‌ను చూపాలని స్పష్టం చేసింది. ఆ వీడియోలో ‘చైల్డ్‌ హెల్ప్‌లైన్‌’ నంబరును  పొందుపర్చాలని పేర్కొంది. ఫోరెన్సిక్‌ నివేదిక ఆలస్యం కావడంతో దర్యాప్తులో జాప్యం చోటు చేసుకుంటోం దని సీనియర్‌ న్యాయవాది గిరి పేర్కొనడంపై స్పందిస్తూ.. ప్రతీ జిల్లాలో పోక్సో కేసుల కోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఏర్పాటు విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు.. పోక్సో కేసుల నివేదికలను సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. జడ్జీల నియామకం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బంది, చిన్నారులకు అనుకూలంగా ఉండే కోర్టు భవనాల్లో మౌలిక వసతులు.. ఇవన్నీ కేంద్ర నిధుల ద్వారానే జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 26వ తేదీకి వాయిదా వేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top