భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీపై దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
- నాలుగు వారాల్లోగా స్పందన తెలపాలని ఆదేశం
న్యూఢి ల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీపై దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా స్పందన తెలిపాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆర్డినెన్స్ పునఃజారీ చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు రైతు సంఘాలు వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్దేలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
తమ దావాను అత్యవసరంగా విచారించాలని, లేకపోతే అది నిష్ఫలమవుతుందని పిటిషనర్ల న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. చట్టం వస్తే పిటిషన్ నిష్ఫలమవుతుందని, తాము అవతలి పక్షం వాదన కూడా వినాల్సి ఉందని పేర్కొంది. భూ ఆర్డినెన్స్‌ను తిరిగి జారీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా రాజ్యసభను ప్రొరోగ్ చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని రైతు సంఘాలు తమ పిటిషన్‌లో ఆరోపించడం తెలిసిందే.
కేంద్రానికి గడువు విధించలేం
ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో కేంద్రానికి ఎలాంటి గడువూ విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొత్త చట్టం తీసుకురావడం లేదా చట్టాన్ని సవరించడం ప్రభుత్వ అభీష్టానికే విడిచిపెడుతున్నామంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్నారైలకు ఓటు హక్కు దాఖలుపై పలు పిటిషన్లపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. కేరళలో 70 శాతం మంది ఎన్నారైలే ఉన్నందున, వారందరికీ వెంటనే ఓటు హక్కు కల్పించేలా ఆదేశించాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే కోర్టును కోరారు.