పరువుకు పాడెకట్టిన ‘యూజీసీ’

Row over UGC Directive On Surgical Strike Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘విశ్వవిద్యాలయాల్లో బోధన, పరీక్షలు, పరిశోధనల ప్రమాణాలను కొనసాగించడమే కాకుండా వాటిని పెంచేందుకు, అలాగే యూనివర్శిటీ విద్య ప్రోత్సహానికి దోహదపడుతాయని భావించిన చర్యలను ఎప్పటికప్పుడు యూనివర్శిటీలు లేదా సంబంధిత సంస్థలతో సంప్రతింపులు జరపడం ద్వారా అమలు చేయడం యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సాధారణ విధులు’ అని 1956 నాటి చట్టం నిర్దేశిస్తోంది.

దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్‌ 29వ తేదీన ‘సర్జికల్‌ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌’ తాజాగా ఓ సర్కులర్‌ జారీ చేసింది. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సర్కులర్‌కు యూజీసీ విధులకు ఎలాంటి సంబంధం లేదు. విద్యా, బోధన, పరిశోధనకు సంబంధించిన ఏ అంశం ఇందులో లేదు. పైగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా ఈ సర్కులర్‌ను జారీ చేసింది. ఇప్పుడే కాదు, గత నాలుగేళ్లుగా సంస్థ ప్రమాణాలను, పరువును పణంగా పెట్టి, తనకు అస్సలు సంబంధంలేని వ్యవహారాలకు సంబంధించి సర్కులర్లను జారీ చేసింది.

‘స్వచ్ఛ భారత అభియాన్‌’లో పాల్గొన్న విద్యార్థులకు విద్యా ప్రమాణాలకిచ్చే అవార్డులు ఇవ్వాలని యూనివర్శిటీలను ఆదేశిస్తూ, ఐక్యతా పరుగులో పాల్గొనాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిస్తూ, యూనివర్శిటీ ఆవరణలో భారత సైనిక ధైర్య సాహసాలను ప్రతిబింబించే గోడలను ఏర్పాటు చేయాలంటూ యూజీసీ పలు సర్కులర్లను జారీ చేసింది. ఇలా తనకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చి ఉన్న మెదడు కాస్త యూజీసీ పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎంఫిల్, పీహెచ్‌డీ, టీచింగ్‌ పోస్టుల రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను తరచూ మారుస్తూ విద్యార్థుల లోకంలో గందరగోళం సృష్టించడమే కాకుండా తాను గందరగోళంలో పడిపోయింది. ఫలితంగా దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో వేలాది టీచింగ్‌ పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. సరైన లైబ్రరీలు, లాబరేటరీలు లేక యూనివర్శిటీలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోవాల్సిన యూజీసీ ఈ యాత్రలో పాల్గొనండీ, ఆ యాత్రలో పాల్గొనండంటూ సర్కులర్ల మీద సర్కులర్లు జారీ చేస్తోంది. రెండేళ్ల క్రితం పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి భారత సైన్యం జరిపిన ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’కు ఇప్పుడు, అంటే ఇంత ఆలస్యంగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో?!

ఇవేవి విద్యకు సంబంధించిన సర్కులర్లు కాకపోవడం వల్ల వీటిని పట్టించుకోవాల్సిన అవసరమే యూనివర్శిటీలకు లేదు. అయితే గ్రాంటుల కోసం యూజీసీ మీద ఆధారపడాలి కనుక యూజీసీ ఆదేశాలనుగానీ సూచనలనుగానీ తిరస్కరించే పరిస్థితుల్లో యూనివర్శీటీలు ఉండకపోవచ్చు. కానీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్లు ఇలాంటి సర్కులర్లను ప్రశ్నించవచ్చు. యూజీసీ గత నాలుగేళ్లుగా తన స్వయం ప్రతిపత్తిని, పరువును పణంగా పెట్టి కేంద్రంలోని పాలక ప్రభుత్వానికి ఓ కొరియర్‌గా పనిచేస్తున్నా ఒక్క వీసీ అంటే ఒక్క వీసీ ప్రశ్నించడం లేదంటే ఎంత సిగ్గు చేటో!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top