గుంటూరులో ఒకటి, విశాఖలో ఒకటి
దేశవ్యాప్తంగా 22 నకిలీ వర్సిటీలు
జాబితా విడుదల చేసిన యూజీసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ విశ్వవిద్యాలయాలున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. గుంటూరు కాకుమానువారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టెమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఎన్జీవోస్ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా.. నకిలీ విశ్వవిద్యాలయాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బోధన సాగిస్తున్న 22 నకిలీ వర్సిటీలు, సంస్థల జాబితాను యూసీజీ తాజాగా విడుదల చేసింది.
ఈ సంస్థలు అందించే డిగ్రీలు వృత్తిపరమైన ఉపయోగాలకు చెల్లవని స్పష్టం చేసింది. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వయం ప్రకటిత వర్సిటీలు, విద్యాసంస్థల తీరుపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ కోట్లా ముబారక్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ అనుమతులు లేకుండానే డిగ్రీ కోర్సులు నిర్వహిస్తోందని, ఆ డిగ్రీలకు విలువ లేదని స్పష్టం చేసింది.
జాతీయ విద్యాసంస్థల పేర్లతో..
యూజీసీ విడుదల చేసిన జాబితా ప్రకారం నకిలీ విద్యాసంస్థలు అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిది ఉన్నాయి. తరువాత ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఐదు నకిలీ విద్యాసంస్థలు బయటపడ్డాయి. ఢిల్లీలో ప్రఖ్యాత జాతీయస్థాయి వర్సిటీలను పోలిన విధంగా నకిలీ సంస్థలకు ‘నేషనల్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్’ వంటి పదాలను పేర్లలో చేర్చి కనికట్టు చేస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో విద్యాపీఠాలు, ఓపెన్ వర్సిటీలు, పరిషద్‌లు మాదిరిగా నకిలీ విద్యాసంస్థలు చలామణి అవుతున్నాయి. వీటిల్లో తక్కువ ఖర్చుతో విద్య పూర్తవుతుందని నమ్మబలికి నకిలీ డిగ్రీలిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. నకిలీ విద్యాసంస్థలు కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో రెండేసి, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కొక్కటి ఉన్నాయి.
చర్యలు తీసుకునే
అధికారం రాష్ట్రాలదేవాస్తవానికి దేశంలో విద్యాసంస్థల గుర్తింపుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. అసలు విద్యార్థులకు ఏది నకిలీ, ఏది ఒరిజినల్ డిగ్రీ అందించే సంస్థ అని గుర్తించేందుకు అవకాశాలు ఉండట్లేదు. యూజీసీ ఏటా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాలను ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది. నకిలీ విద్యాసంస్థల యాజమాన్యాలు వివిధ రకాలుగా తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి.
ఈ సంస్థల జాబితా ప్రకటించే యూజీసీకి.. వాటిని మూసివేసే అధికారం మాత్రం లేదు. ఈ సంస్థలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చర్యలు తీసుకోగలవు. దాదాపు ఏ రాష్ట్రంలోను నకిలీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. ఒకవేళ చర్యలు చేపట్టినా.. సంస్థ పేరు మార్పుతో మళ్లీ పుట్టుకొస్తున్నాయి.


