పోలీసులపై రాళ్ల దాడి.. టియర్ గ్యాస్ ప్రయోగం

Residents Pelt Stones on Police in Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో స్థానికులకు, పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. పోలీసులపైకి స్థానికులు రాళ్లురువ్వడంతో, పోలీసులు టియర్‌గ్యాస్(భాష్పవాయువు) ప్రయోగించి వారిని చెదరగొట్టారు. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో అధికారులు కేవలం పాలు దుకాణాలు, మెడికల్‌ షాపులు, నిత్యావసరాల షాపులను తెరిచి మిగతావాటిని మే 15 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తినియంత్రణకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ 3.0 సడలింపులను ఎత్తివేసి కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.

దీంతో అహ్మదాబాద్‌లోని షాపూర్‌లో పారామిలిటరీ దళాలు, పోలీసులు.. స్థానికులను లాక్‌డౌన్‌ను పాటించి ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు స్థానికులు వారిపై రాళ్లను విసరడం ప్రారంభించారని నగర కమిషనర్‌ ఆశిశ్‌ భాటియా తెలిపారు. అల్లరిమూకలను చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలవ్వగా, 8మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇక మన దేశంలో కరోనా బారిన పడిన నగరాల్లో  అహ్మదాబాద్‌ ఒకటి. గుజరాత్‌లో 7402 కేసులో నమోదవ్వగా, ఒక్క అహ్మదాబాద్‌లోనే 5000లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.(కరోనా : 24 గంటల్లో 3,320 కొత్త కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top