ఆర్థిక సంస్కరణల అమలు వేగంపై ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల అమలు వేగంపై ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందినప్పటికీ.. ఆ ప్రభావంతో సంస్కరణల వేగం తగ్గబోదని ఆయన వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. 5వ భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా గురువారం అమెరికా ఆర్థిక మంత్రి జాకాబ్ లీతో కలసి జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని జైట్లీ తెలిపారు. ‘నిజానికి నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం.
ఒక్కచోట మాత్రమే కోల్పోయాం. ఈ పరిణామం.. ఆర్థిక సంస్కరణలపై ఎంతమాత్రమూ పడబోదు’ అని పేర్కొన్నారు. పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగ కల్పన, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల, పేదరికాన్ని తగ్గించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్టు జైట్లీ వివరించారు.