కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ | Rajya Sabha polling underway in Karnataka and Madhya Pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్

Jun 11 2016 10:49 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్లో శనివారం ఉదయం సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

న్యూఢిల్లీ:  ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్లో శనివారం ఉదయం సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా  మొత్తం 57 స్థానాలకుగాను 30 ఏకగ్రీవం కాగా, 27 స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. కొన్ని సీట్లకు తీవ్రస్థాయిలో పోటీ పడుతుండటంతో పోరు రసవత్తరంగా మారింది. అలాగే ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. కర్ణాటకలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను గెలిపించుకునేందుకు (44మంది మద్దతు అవసరం) బీజేపీకి ఒక ఓటు తక్కువగా ఉంది. కాగా పోలింగ్ సందర్భంగా నిర్మలా సీతారామన్...ఈరోజు ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

అలాగే  కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ప్రీతి మహాపాత్ర మధ్యే ఆసక్తికర పోరు జరగనుంది. బీఎస్పీ వద్ద అదనంగా ఉన్న 12 మంది ఎమ్మెల్యేల మద్దతుపైనే కపిల్ సిబల్ నమ్మకం పెట్టుకున్నారు. ఇక హరియాణాలోనూ బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన జీ మీడియా గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనంద్ మధ్య పోటీ ఉంది.

అయితే ఐఎన్‌ఎల్‌డీ తన 19 మంది ఎమ్మెల్యేల మద్దతును ఆనంద్‌కు ఇవ్వనున్నట్లు తెలిపింది.  రాజస్థాన్‌లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతోపాటు నలుగురు అభ్యర్థులను (నాలుగు సీట్లు) గెలిపించుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్, స్వతంత్ర ఎమ్మెల్యేలపై లంచాల ఆరోపణలు రావడంతో, ఎన్నికలు రద్దు చేయాలనే డిమాండు వచ్చినా.. ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement