ప‌ర్యాట‌కుల‌కు రాజ‌స్థాన్ అట‌వీ శాఖ కొత్త ప్ర‌తిపాద‌న

Rajasthan Forest Department Refuse To Refund Tickets Sold In Lockdown - Sakshi

జైపూర్: లాక్‌డౌన్‌ కాలంలో రంథ‌మ్‌బోర్ పులుల అభ‌యార‌ణ్యాన్ని సంద‌ర్శించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న‌వారికి డ‌బ్బులు తిరిగి చెల్లించ‌లేమ‌ని రాజ‌స్థాన్ అట‌వీ శాఖ తేల్చి చెప్పింది. ఇప్ప‌టికే ఆ డ‌బ్బును రాష్ట్ర ఖ‌జానాలో జ‌మ చేసినందున తిరిగి ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌ని పేర్కొంది. అయితే ఓ వెసులుబాటు క‌ల్పించింది. ప‌ర్యాట‌కులు ఎప్పుడైనా రాష్ట్రంలో ప‌ర్య‌టించవ‌చ్చున‌ని స్పష్టం చేసింది.  ఇందుకు జూన్ 22, 2022 వర‌కు గ‌డువు విధించింది. కాగా మార్చి 18 నుంచి జూన్ 30 మ‌ధ్య‌ 28 వేల మంది ప‌ర్యాట‌కులు రంథ‌మ్‌బోర్ పులుల అభ‌యార‌ణ్యాన్ని సంద‌ర్శించేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో ప‌ది వేల‌మంది విదేశీయులు ఉన్నారు. (రిజర్వ్‌ ఫారెస్ట్‌ దత్తత తీసుకుంటా..)

బుక్ చేసుకున్న టికెట్ల విలువ రూ.8 కోట్లు ఉంది. అయితే వీటిని తిరిగి చెల్లించ‌డానికి బ‌దులుగా జూన్ 2022లోపు ఎప్పుడైనా టైగ‌ర్ రిజ‌ర్వ్‌ను సంద‌ర్శించేందుకు అట‌వీ శాఖ‌ అవ‌కాశం ఇచ్చింది. ఇందుకోసం ప‌ర్యాట‌కులు మూడు తేదీలను సూచించాల్సిందిగా కోరింది. వాటిని ప‌రిశీలించిన పిద‌ప అందులో ఒక తేదీని ఖ‌రారు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా పులుల అభ‌యార‌ణ్యంలోకి ప్ర‌వేశించిన అనంత‌రం వాటిని ద‌గ్గ‌ర నుంచి వీక్షించేందుకు జిప్సీ, క్యాంట‌ర్‌ల‌లో వెళ్లాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకోవాలంటే స్వ‌దేశీయులు 1100 రూపాయ‌లు, 780 రూపాయ‌లు చెల్లించాల్సి ఉండ‌గా విదేశీయులు 1800, 1200 రూపాయ‌లు ఇవ్వాల్సి ఉంటుంది. (అడవి బిడ్డే హక్కుదారు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top