హిందూ కార్డ్‌తోనే బీజేపీకి చెక్‌

Rahul plans Hindu card  to counter BJP in UP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీని పార్టీలోకి తీసుకువచ్చి యూపీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఇక బీజేపీ హవాకు చెక్‌ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. హిందూ కార్డ్‌తోనే ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని నిలువరించాలని రాహుల్‌ భావిస్తున్నారు. యూపీలో రాహుల్‌ పాల్గొనే 12 ర్యాలీల్లో తనకు తోడుగా ప్రియాంకను కూడా ఆయా సభల్లో ముందు నిలిపేలా రాహుల్‌ ప్రణాళికలు రూపొందిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో కేంద్రంగా యూపీ అంతటా ప్రియాంక ప్రచార పర్వంతో హోరెత్తించనున్నారు.

కుంభమేళా కేంద్రంగా..
హిందుత్వ కార్డుతో హిందీ రాష్ట్రాల్లో బీజేపీ దూసుకుపోతుంటే అదే అంశాన్ని రాహుల్‌ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించే ఘట్టాన్ని రాహుల్‌ ఇందుకు మెరుగైన అవకాశంగా భావిస్తున్నారు. ఫిబ్రవరిలో కుంభమేళాలో పాల్గొనే రాహుల్‌ ఈ కార్యక్రమాన్ని పార్టీకి అనుకూలంగా మలిచేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో రాహుల్‌ జంధ్యం ధరించే బ్రాహ్మణుడని కాంగ్రెస్‌ ప్రతినిధి సుర్జీవాలా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక కుంభమేళాలో లక్షలాది మంది వీక్షిస్తుండగా పుణ్యస్నానం ఆచరించడం ద్వారా హిందూ మూలాలను బలంగా ప్రజల్లోకి పంపవచ్చని రాహుల్‌  భావిస్తున్నారు. రాహుల్‌ జంధ్యంతో పాటు పసుపు పంచె, కండువా ధరించి గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌ స్నానం చేస్తుండగా 12 మంది పండితులు వేదమంత్రాలను జపిస్తారని వెల్లడించాయి. కాగా రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయంలో రాహుల్‌ తొలిసారి తన కులగోత్రాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆలయ పూజరి అడిగిన వివరాల మేరకు రాహుల్‌ తాను బ్రాహ్మణుడినని, తమది దత్తాత్రేయ గోత్రమని బదులిచ్చారు.

యూపీపై గురి
సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై కాంగ్రెస్‌ ప్రధానంగా దృష్టిసారించింది. ప్రియాంక ఎంట్రీతో పాటు తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదనే బలమైన సంకేతాలు పంపాలని ఆ పార్టీ యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో మెరుగైన ఫలితాల కోసం తాము శక్తియుక్తులను కూడదీసుకుని బలం‍గా పోరాడతామని తన నియోజకవర్గం అమేథి పర్యటన సందర్భంగా రాహుల్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top