
హెలికాప్టర్ డోర్లకు స్క్రూలు బిగించిన రాహుల్‌గాంధీ
సిమ్లా : ఎన్నికల ప్రచారానికి వెలుతున్న సోదరి ప్రియాంకా గాంధీకి విశాలమైన హెలీకాప్టర్‌ను కేటాయించి, సుడిగాలి పర్యటనలు చేస్తున్న తాను మాత్రం చిన్న హెలీకాప్టర్‌తో ఔదార్యాన్ని చాటుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇప్పడు మోకానిక్ అవతారమెత్తారు. హెలికాప్టర్‌ను రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చాపర్ కిందకు చేరి నేలపై పడుకొని మరమ్మతు చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో శుక్రవారం రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా, ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు సాంకేతిక సమస్య వచ్చింది. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సైతం ఓ చెయ్యివేసి వారికి సహకరించారు. నేలపై పడుకొని హెలికాప్టర్ డోర్లకు స్క్రూలు బిగించారు. ఇలా అందరం కలిసికట్టుగా పనిచేసి మరమ్మతు చేశామని ప్రమాదమేమీ లేదని ఆయన తెలిపారు. టీమ్ వర్క్ అంటే అందరూ కలిసికట్టుగా శ్రమించడమేనని, సమిష్టిగా కష్టపడటంతో సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని పేర్కొన్నారు.