అంగ వికలురకు రాహుల్ వాహనాల పంపిణీ | Rahul Gandhi distributes vehicles to differently abled youth | Sakshi
Sakshi News home page

అంగ వికలురకు రాహుల్ వాహనాల పంపిణీ

Aug 20 2016 12:56 PM | Updated on Sep 4 2017 10:06 AM

రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన రాహుల్.. అంగవికలురకోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

న్యూఢిల్లీః భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో శారీరక, మానసిక వికలత్వం ఉన్నవారికి ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన  రాహుల్.. అంగవికలురకోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజీవ్ గాంధీ దృష్టి, విలువలు, లోతైన నిబద్ధతను నెమరువేసుకున్న రాహుల్.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓ మహా నేత అని, ఆయన ప్రజలందరికీ స్ఫూర్తిదాత అంటూ ట్వీట్ చేశారు.

20 నుంచి 30 ఏళ్ళ మధ్య వయస్కులైన మొత్తం 100 మంది వైకల్యం కలిగిన యువతకు రాహుల్ గాంధీ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో వారి ఆర్థిక పరిస్థితులను, భవిష్యత్ ప్రణాళికలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. వారిలో ఎక్కువశాతం మంది మంచి విద్యార్హతలను సైతం కలిగి ఉండటాన్ని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. శారీరక, మానసిక వైకల్యాలను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న వారంతా ఎందరికో స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు. ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ యాక్సెస్ టు ఆపర్చూనిటీస్ ప్రొగ్రామ్ ద్వారా వైకల్యం కలిగిన వారిని ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు ట్రస్టీగా ఉన్న  రాహుల్.. రాజీవ్ జయంతి సందర్భంలో ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.


21వ శాతాబ్దపు ప్రజలందరికీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గొప్ప మార్గదర్శిగా చెప్పాలంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ ఇండియాకు ఆరవ ప్రధాన మంత్రిగా 1984 నుంచి 1989 వరకూ సేవలందించారు. 1984 లో ఆయన తల్లి శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ బాధ్యతలను స్వీకరించారు. తమిళనాడు శ్రీపెరంబుదూర్ వద్ద ఆత్మహుతి బాంబుదాడిలో రాజీవ్ గాంధీ 1991 మే 21న హత్యకు గురయ్యారు.

Advertisement

పోల్

Advertisement